Thursday, 5 November 2026

మున్సిపాలిటీలో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమం – మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి

హుజూర్ నగర్ మే 19 (జనంసాక్షి):
కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి తెలిపారు.
శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో గత ఐదు నెలలుగా సేవలందించిన కంటివెలుగు సిబ్బందికి మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ అర్చన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కంటి వెలుగు కోఆర్డినేటర్ ఇందిరాల రామకృష్ణ మాట్లాడుతూ 17 వార్డులలో 10,331 మందిని పరీక్షించి 2,172 మందిని నిర్ధారించి కంటి అద్దాలను అందజేయడం జరిగిందన్నారు. మరో 787 మందికి ఆర్డర్ ద్వారా కళ్ళజోలను అందించి 1863 మందిని కంటి ఆపరేషన్లకు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుష్మ, ఆప్తమెట్రీషియన్ మల్లిక, డాటా ఎంట్రీ ఆపరేటర్ శివ, ఏన్ఎంలు హైమావతి, కవిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.