Tuesday, 3 November 2026

మురికి కాలువ కాదు… సిసి రోడ్డు.

మురికి కాలువ కాదు… సిసి రోడ్డు.

కౌన్సిలర్ జాడలేడు.. అధికారులు పట్టించుకోరు..

కష్టాలు తీర్చాలని శాంతినగర్ కాలనీవాసుల వేడుకొలు.

సిరిసిల్ల. అక్టోబర్ 28. (జనం సాక్షి). మురికి కాలువను మరిపిస్తున్న దృశ్యం సిరిసిల్ల పట్టణం రెండవ వార్డు శాంతినగర్ లోనిది. నిజంగా మురికి కాలువ అనుకుంటే పొరపాటే. మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోవడంతో నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తుంది. దీనికి తోడు కాలనీలో డ్రైనేజీ కాలువలు నిర్మించిన అనంతరం సిసి రోడ్లు వేయాలని నిబంధనలను విస్మరించిన అధికారుల వైఖరి కాలనీవాసులకు శాపంగా మారింది. మిషన్ భగీరథ నీళ్లతో పాటు మురుగునీరు సిసి రోడ్డుపైనే ప్రవహిస్తుండడం వల్ల తీవ్ర దుర్గంధం వెదజల్లి కాలనీవాసులకు తిప్పలు తప్పడం లేదు. దోమలు విపరీతంగా పెరిగిపోయి జ్వరాల బారిన పడుతున్నామని తమ కష్టాలను గట్టెక్కించాలని స్థానిక కౌన్సిలర్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరం చూపడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుబట్టి గెలిపించుకుంటే సమస్యలు వినేందుకు కూడా కౌన్సిలర్ రాకుండా పత్తా లేకుండా పోయాడంటూ కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్డుపై నిత్యం మురుగునీరు ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి జారిపడిపోయిన సంఘటనలు అనేకం జరిగినట్లు కాలనీవాసులు తెలిపారు. భూలక్ష్మి అనే వృద్ధురాలు జారిపడిపోయి తీవ్ర గాయాల పాలయ్యానని రోధిస్తూ తెలిపింది. స్వచ్ఛ పురస్కారాలు సాధించి పెడుతున్న అధికారులు కాలనీలలో సమస్యల పైన కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. మిషన్ భగీరథ అధికారులు మాత్రం కనీసం ఇటువైపు చూడకపోవడం పట్ల కాలనీవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.