Wednesday, 4 November 2026

ముష్టిపల్లి రాజీవ్ నగర్ కాలనీ వాసులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం.

రాజన్న సిరిసిల్ల బ్యుతో. జూన్ 8.,(జనంసాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ ముష్టిపల్లి కాలనీవాసులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని పీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. గురువారం ముష్టిపల్లి రాజీవ్ నగర్ ను సందర్శించిన ఆయన కాలనీలోని 150 పైగా ఇండ్లను కూల్చేందుకు అధికారులు మార్క్ చేశారని తెలిపారు. కాలనీవాసులకు నష్టం జరగకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయకముందు ఇచ్చిన హామీలు మునిసిపాలిటీలో కలిసిన తర్వాత విస్మరించడం తగదని అన్నారు. 18 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం బఫర్ జోన్ గా ప్రకటించి ఇండ్లను కూల్చడం సరి కాదని అన్నారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిందం శ్రీనివాస్, అక్కినేని సతీష్ జడల రాజు తదితరులు పాల్గొన్నారు.