Monday, 2 November 2026

మూగబోయిన ఉద్యమ గానం -సాయి చందు మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు -మండల సర్పంచ్ల ఫోరం

సైదాపూర్/తెలంగాణ మట్టి బిడ్డ, ప్రజా గాయకుడు, కవి, వగ్గేయకారుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయి చందు మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు చందా శ్రీనివాస్ కాయిత రాములు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా తన పాట ద్వారా ప్రజలను ఉర్రూతలూగించిన సాయి చందు మరణం రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిసి వేసిందని అన్నారు. దగా పడిన తెలంగాణ బతుకు వెతలను చూసి ధూంధాం వేదికలపై సాయి చందు గొంతుకయ్యాడని అన్నారు. సాయి చందు విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో మమేకమై తన ఆటపాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారని అన్నారు.ఎక్కడ సభ జరిగిన ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సాయి చందు తన ఆటపాటలతో గంటలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చేవాడని తెలిపారు. సాయి చందు మరణంతో తెలంగాణ సమాజం గొప్ప ప్రజా కళాకారుని కోల్పోయిందని , ప్రత్యేక తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి గానంలో సాయి చందు పాత్ర మరువలేనిదని వారు అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు.