– చిన్నారికి నయం చేయిస్తానని హామీ జనంసాక్షి , మంథని : మూగ, వినికి లోపంతో బాధపడుతున్న చిన్నారికి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదబండకు చెందిన మంథని శ్రీనివాస్ ఐదేండ్ల కూతురు హృతిక పుట్టుక తోనే చెవుడు, వినికిడి లోపంతో బాధపడుతోంది. పనిచేసుకుంటేనే పూట గడిచే శ్రీనివాస్ తన కూతురుకు మెరుగైన వైద్యం అందించి బాగు చేయించుకోవాలని తపన పడ్డాడు. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్నా తన కూతురు కోసం అప్పు చేసైనా బాగు చేయించుకోవాలని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, హన్మకొండ లాంటి ప్రాంతాల్లోని అనేక ఆస్పత్రులకు తీసుకెళ్లాడు. ఆయా ఆస్పత్రుల్లో హృతికకు పరీక్షలు చేసి లక్షల్లో ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. లక్షలు వెచ్చించే స్థోమత లేని శ్రీనివాస్ దిక్కుతోచని స్థితిలో కుమిలిపోయాడు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం ముత్తారం మండల పీఏసీఎస్ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డిని కలిసి తన కూతురు పరిస్థితి, తన ఆర్థిక పరిస్థితిని వివరించి తన గోడును వెల్లబోసుకున్నాడు. రాజిరెడ్డి శ్రీనివాస్ పరిస్థితిని విని మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కి హృతిక గురించి వివరించారు. పేదోడికి ఆపద వచ్చిందంటే ఛలించిపోయే జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ వెంటనే శ్రీనివాస్‌ను తనను కలువమని చెప్పడంతో గత వారం రోజుల క్రితం మంథనిలోని రాజగృహాలో శ్రీనివాస్ తన కూతురును తీసుకుని జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్‌ను కలిసి రిపోర్ట్‌లు చూపించారు. హృతికను చూసిన పుట్ట మధూకర్ హృదయం ఛలించిపోయి తనతో పాటు హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని తన నివాసంలో వసతి కల్పించి హైదరాబాద్‌లోని ప్రముఖ ఈఎన్‌టీ హస్పటల్ అయిన రావూస్ ఆస్పత్రికి స్వయంగా తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. చిన్నారికి పరీక్షలు చేసిన వైద్యులు ముందుగా చెవిలో మిషన్ ఏర్పాటు చేయాలని, అటు తర్వాత మూడు మాసాల పాటు స్పీచ్ థెరఫి చేయించాలని, అలా చేయడం ద్వారా చిన్నారికి మాటలు వచ్చే అవకాశం వస్తుందని వైద్యులు చెప్పారు. మూడు మాసాల పాటు హైదరాబాద్‌లో శ్రీనివాస్ కుటుంబానికి వసతి కల్పించడంతో పాటు ఆస్పత్రిలో వైద్య చికిత్సలకు సంబంధించిన ఖర్చు తానే భరిస్తానంటూ హమీ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హమీతో శ్రీనివాస్ కుటుంబంలో కొత్త వెలుగులు కన్పిస్తున్నాయి. తన కూతురు అందరిలాగే మామూలుగా అవుతుందనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ఎవరికి మాట ఇవ్వరని, ఇస్తే మాత్రం తప్పకుండా చేస్తాడనే నమ్మకం ఇప్పటికే మంథని నియోజకవర్గంలో ఉండగా తాజాగా శ్రీనివాస్ కూతురుకు వైద్యచికిత్స అందిస్తామని హమీ ఇవ్వడంతో మరోమారు పుట్ట మధూకర్ మనస్సు ఎంత మధురమోనని పలువురు అభినందిస్తున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ లాంటి నాయకుడు ఇప్పటి వరకు ఎవరూ లేరని, అలాంటి నాయకుడు ఉంటే ప్రతి పేదవాడికి ఎనలేని ధైర్యం లభిస్తుందనే పలువురు పేర్కొంటున్నారు.




