నైరుతి రుతుపవనాలు ఈసారి ముందస్తుగానే పలకరించాయి. అనుకున్న సమాయానికి కంటే మూడు రోజుల ముందుగానే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. మరింత చురుకుగా కదులుతున్న రతుపవనాలు… రాగల 24 గంటల్లో మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇప్పటికే అండమాన్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు.. జూన్ ఒకటికి ముందే కేరళ తీరాన్ని తాకట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. దీంతో ఇండియాపై ఎల్‌నినో ప్రభావం ఉండే ఛాన్స్ లేదని అభిప్రాయపడ్డారు అధికారులు.
అటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో.. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రుతుపవనాలు, రానున్న రెండు, మూడు రోజుల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనుండడంతో.. వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే అన్నదాతలు సాగుకు సర్వం సిద్ధం చేసుకోగా.. తొలకరి కోసం ఎదురు చూస్తున్నారు.




