Wednesday, 4 November 2026

మెరుగైన విద్య కల్పించడంలో ప్రభుత్వం విఫలం

సమస్యలపై పోరాడితే అక్రమ అరెస్టులు..
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్
మేడిపల్లి – జనంసాక్షి
రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. సమస్యలపై పోరాటం చేస్తుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, ఈ చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త పాఠశాలలు, కళాశాలలు బంద్ సందర్బంగా మేడ్చల్ జిల్లాలో బంద్ నిర్వహిస్తున్న సమయంలో  బోడుప్పల్ ఉన్నత పాఠశాల వద్ద ముందస్తు అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ  సందర్బంగా పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ప్రారంభమై నేటికి నెల రోజులు గడుస్తున్నా.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. అరకొర పరిస్థితిలో విద్య కొనసాగుతుందని, బోధించడానికి ఉపాధ్యాయులు లేరని, ఒకవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు పెద్దఎత్తున చేరుతుంటే కనీసం కూర్చుండడానికి తరగతి గదులు, ఫర్నిచర్ లేని దరిద్రమైన పరిస్థితి తెలంగాణలో నెలకొన్నదని తెలిపారు. జిల్లాలో అక్కడక్కడ మండలాల్లో జూనియర్ కళాశాలలు ఉన్నప్పటికీ సరిపడా లెక్చరర్ లేక, మౌలిక సదుపాయాలు లేక గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత రేటు పెంచడానికి ఈ తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందని తెలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు దోచుకుంటే ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తున్నాయి.. కనీసం “ఫీజు నియంత్రణ చట్టం”లేని పరిస్థితి తెలంగాణలో ఉన్నదన్నారు. “కేజీ టు పీజీ లేదు. జూనియర్ కళాశాలలో ఎప్పుడో పెడతామన్న మధ్యాహ్న భోజన పథకం లేదు. పుస్తకాలు రావు వచ్చినా చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండరు. ఇవన్నీ చూసుకోవడానికి మండలానికి ఒక్క ఏంఈఓ కూడా నియమించరు” అని వివరించారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు.
డిమాండ్స్..
1. తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందించాలి.
2. మధ్యాహ్న భోజన పథకం నిధులు పెంచాలి నాణ్యత పాటించాలి.
3. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు పోస్టులు భర్తీ చేయాలి.
4. ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి.
5 కార్పొరేట్ విద్యాసంస్థలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలి.
6. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి.
7. విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్ ఇవ్వాలి.
8. విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020ను రద్దు చేయాలి.