Wednesday, 4 November 2026

మేకిన్‌ ఇండియా పేరుతో వంచన

ఉక్కు పరిశ్రమ ఏర్పాటును విస్మరించడమే నిదర్శనం

నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన మోడీ

అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): దేశంలో మేకిన్‌ ఇండియా వెనక్కి పోయింది. ఎన్నో పరిశ్రమలతో ఉపాధి మార్గాలు చూపిస్తారని మోడీ మాటలతో ప్రజలు మరిసిపోయారు. కానీ అదంతా ఉత్తిదే అని తేలిపోయింది. సహజ వనరులను ఉపయోగించుకుని దేవీయంగా ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు, విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నాయి. పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం అనే విషయాన్‌ఇన మరచిపోయాయి. అలాగే పరిశ్రమల స్థాపన విషయంలో కొంత నష్టం లేదా కష్టం కలిగినా యువతకు ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలన్న ధోరణి కానరావడం లేదు. వీటి ఏర్పాటు సాధ్యం కాదనుకుంటే దేశంలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని గతంలో సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తీరు నిరుద్యోగులను వంచించేలా ఉంది. అలాగే స్థానికంగా లభ్యమవుతున్న ముడిసరుకుని విదేశాలకు తరలిస్తున్న తీరును అడ్డుకునేలా లేదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు జరిగివుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దక్కేది. అనుబంధ పరిశ్రమల ఏర్పాఉటకు అవకాశం కలిగేది. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలున్నాయనీ,

అనంతపురం గనుల ఖనిజం నాణ్యత ఎక్కువనీ మెకాన్‌ సంస్థ నిర్ధారించింది. కడప ఉక్కు కర్మాగారానికి ఆ ఖనిజ నిక్షేపాలను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతనూ తెలిపింది. వీటన్నిటి ఆధారంగా కడప ఉక్కు కర్మాగార ఏర్పాటు సాధ్యమేనని మెకాన్‌ సంస్థ గతేడాది సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయినా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో 2017 డిసెంబర్‌నాటి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం గురించి మాత్రమే పేర్కొనడం వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అన్నది గమనించాలి. ఇలాంటి విషయాల్లో నాలుగేళ్లుగా కాలయాపన చేసి చివరి సంవత్సరం చేతులెత్తేయడం ద్వారా బృహత్తర లక్ష్యాన్ని దెబ్బతీయడం కాకా మరోటి కాదు. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉన్న అవకాశాలను దెబ్బతీయడం తప్ప మరోటి కాదు. కడప ఉక్కు విషయంలో మోసాన్ని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో నిరసించారు. ఇదంతా మోడీ మేకిన్‌ ఇండియాకు విరుద్దంగా సాగుతోందన్న విషయం గమినంచాలి. మేకిన్‌ ఇండియా అన్నది కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. రైల్వే జోన్‌ ఏర్పాటుపైనా ఎన్‌డిఎ ప్రభుత్వం దోబూచులాడుతూనేవుంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మూడేళ్లు మాత్రమే ఇచ్చి, తర్వాత నిలిపివేసింది. పోర్టు ఏర్పాటుకూ తిలోదకాలిచ్చింది. ఇలా అనేక అంశాల్లో తెలుగు ప్రజలపట్ల మోడీ సర్కారు ద్వేషపూరితంగా వ్యవహరిస్తోంది. సంకుచిత స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు విరుద్దంగా అభివృద్ది సాగాలి. అప్పుడే ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాకారం కాగలదు. దీంతో ఉపాధి దక్కగలదు. అది నిరుద్యోగ యువతకు భరోసా కాగలదు.