Friday, 6 November 2026

మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్‌ చబుత్రాను నిర్వహించారు. రాత్రి వేళల్లో వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా ఉన్న 120 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో వారికి, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ .. యవకులు అర్ధరాత్రి వేళల్లో జులాయిగా తిరుగుతూ, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఉంటూ వచ్చి పోయే ప్రజలను వేధిస్తున్నారన్నారు. అంతేకాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉన్నదని, తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ కనబడితే వారిని అరెస్ట్‌ చేసి వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. యువకులు ఇప్పటినుంచే నేరాల్లో పాల్గొంటే భవిష్యత్‌ ఉండదని యువకులకు సూచించారు. ఇదిలా ఉండగా.. పట్టుబడ్డ 120 మందిలో 101 మంది యువకులకు కౌన్సెలింగ్‌ ఇచ్చా రు. మిగతా 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురిపై నేర చరిత్ర ఉండటంతో వారిని బైండోవర్‌ చేసినట్లు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.