మొదలైన జగన్‌ మహాసంకల్ప యాత్ర

ఇడుపులపాయ వైఎస్‌ సమాధి వద్ద నివాళి

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సుదీర్ఘ పాదయాత్ర

ఆరు నెలలు.. 3వేల కిలోవిూటర్లు

రోజుకు 15కిలోవిూటర్లు పాదయాత్ర

వైఎస్‌ తరహాలో కార్యక్రమ రూపకల్పన

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికలే లక్ష్యంగా, అధికారంలోకి రావడమే పరమావధిగా వైకాపా అధినేత జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఇడుపులపాయలో ప్రారంభమైంది. దాదాపు ఆరునెలల పాటు సాగే ఈ యాత్ర ఇడుపుల పాయలో వైఎస్‌ సమాధి వద్ద నివాళి అర్పించడంతో మొదలయ్యింది. సోమవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్‌ కొద్దిదూరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం సుమారు 10 కిలోవిూటర్లు పాదయాత్ర చేసి రాత్రికి వేంపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు భారీ సంఖ్యలో ఇడుపులపాయకు తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్‌ జగన్‌ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన ‘ప్రజా సంకల్ప’ యాత్రను చేపట్టారు. అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. అశేషమైన అభిమానులు, కార్యకర్తల మద్దతు నడుమ వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేతకు కుటుంబసభ్యులతో కలసి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు ఇక్కడకు చేరుకోవడంతో ఇడుపులపాయ కోలహలంగా మారింది.ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులపాటు3 వేల కిలో విూటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజక వర్గాల్లో పర్యటించి సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు. ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ విూదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుప్లలె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంప్లలె విూదుగా వేంప్లలె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు. జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో విూటర్లు, సాయంత్రం 7 కిలో విూటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిప్లలె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు. ఇడుపులపాయ వద్ద పార్టీనేతలు రోజా, గిడ్డి ఈశ్వరి, రవీంద్రనాథ్‌ రెడ్డి తదితరులు జగన్‌ను అనుసరించారు.

 

 

 

 

 

తాజావార్తలు