జనగణమన పూర్తి కాకుండానే లేచిపోయారు
దేశప్రజలు దీన్ని గమనించారు: రాహుల్
న్యూఢిల్లీ,మే19( జనం సాక్షి): జాతీయగీతం జనగణమన జరుగుతుండగానే కర్ణాటక విధానసభలో బీజేపీ నేతలు, స్పీకర్ అంతా లేచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. జనగణమనపైనా వీరికి గౌరవం లేదన్నారు. దేశప్రజలంతా దీనిని గమనించారని అన్నారు. యడ్యూరప్ప రాజీనామా, అందుకు దారితీసిన పరిణాలపై ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ మాట్లాడుతూ, తొలుత కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షా దేశంలోని అన్ని వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారని, ఇందుకు అన్నిరకాల విధానాలను అనుసరిస్తారనే విషయం మరోసారి దేశప్రజలకు అవగతమైందని అన్నారు. గోవా, మణిపూర్‌లోనూ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఎరచూపారని, కర్ణాటకలోనూ ఇలాంటి ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇందుకు కర్ణాటక ప్రజలు, పార్టీ కార్యకర్తలు, దేవెగౌడ, ఆ పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎలాగానా బలపరీక్షలో నెగ్గేందుకు బీజేపీ ఎన్నో ప్రలోభాలకు పాల్పడినట్టు ఫోన్ సంభాషణలు, టేపులు చెబుతున్నాయని, దీనినిబట్టే దేశంలో అవినీతిని నిర్మూలిస్తామని మోదీ చెప్పే మాటలు పచ్చి అబద్దాలని మరోసారి రుజువైందని రాహుల్ అన్నారు. కర్ణాటకలో తాజా పరిణామం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు ఒక గుణపాఠం అని, ప్రజల అభీష్టం కూడా తాజా ఫలితంతో రుజువైదంని పేర్కొన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్య గెలిచిందని వ్యాఖ్యానించారు. కర్ణాటక విధాసన సభలో ఏం జరిగిందో
అంతా చూశారని, స్పీకర్, భాజపా ఎమ్మెల్యేలు జాతీయగీతం ఆలపించకుండానే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారని అన్నారు. ఆరెస్సెస్, మోదీ, అమిత్ షా ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఐక్యంగా నిలబడిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహించారని మండిపడ్డారు. నిత్యం అవినీతి గురించి మాట్లాడే మోదీ.. కర్ణాటకలో అవినీతిని ప్రోత్సహించారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని భాజపా భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలతో ఫోన్‌లో జరిపిన బేరసారాలు సైతం బహిర్గతమయ్యాయని రాహుల్ అన్నారు. విపక్షాలన్నీ కలిసి భాజపా ఆగడాలను అడ్డుకొని ఓడించాయన్నారు. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవాడు కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలను పాలించేందుకు మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారని గుర్తు చేశారు.
మోడీకి కర్నాటక ఓ గుణపాఠం




