Wednesday, 4 November 2026

మోడీ మళ్లీ అధికారంలోకొస్తే..  మైనార్టీలకు తీవ్ర నష్టం

– మోదీసర్కార్‌ మైనార్టీల హక్కులను కాలరాస్తోంది
– అన్ని మతాలను గౌరవించేది కాంగ్రెస్‌ పార్టీనే
– 12శాతం రిజర్వేషన్‌లు ఏమైయ్యాయో కేసీఆర్‌ చెప్పాలి
– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : మోడీ మళ్లీ అధికారంలోకిస్తే మైనార్టీలకు మళ్లీ తీవ్ర నష్టం జరుగుతుందని, నాలుగేళ్లలో మైనార్టీల పట్ల కేంద్రం పూర్తిగా వివక్షతన ప్రదర్శించిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం బాగ్‌ అంబర్‌పేట్‌లో జరిగిన జమైతా ఉలుమా తెలంగాణ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అభివృద్ధి కంటే.. ఏం తింటున్నావ్‌, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావ్‌ అనే చర్చే ఎక్కువైందని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్య సాధనలో జమైతా ఉలుమా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. కాగాగత నాలుగున్నరేళ్లుగా ఎన్డీయే పాలనలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే
మైనార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. మోదీ సర్కారు మైనార్టీల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించేది కేవలం కాంగ్రెస్‌ పార్టీయేనని పునరుద్ఘాటించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల్లో.. మైనారిటీలకు 12శాతం రేజర్వేషన్‌ కల్పిస్తామంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూలు ఏమయ్యాయని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కేవలం రంజాన్‌ దావత్‌ ఇచ్చి బిర్యానీ పెడితే సరిపోతుందా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మోదీ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 4 శాతం రిజర్వేషన్లతోనే మైనార్టీ పిల్లలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ సీట్లు సాధించి ఉన్నత విద్యనభ్యసించారని గుర్తు చేశారు. అన్ని మతాలను గౌరవించేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీనేనని, డిసెంబర్‌7న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటే వేయాలని ఉత్తమ్‌ కోరారు.