– ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్, నవంబర్3(జనంసాక్షి) : రాష్ట్రంలో మహాకూటమి కుట్రలను తిప్పికొట్టి.. తెలంగాణ ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని సందేశాన్ని ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఈటల రాజేందర్ విూడియాతో మాట్లాడారు.. కాంగ్రెస్, టీడీపీ హయాంలో తెలంగాణ ప్రజలను దగా చేశారని విమర్శించారు. గతంలో ఎందుకు రూ.2వేల పెన్షన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. పెన్షన్లు రెట్టింపు చేస్తాం, అందరికీ బీమా సౌకర్యం కల్పించే విషయం ఆలోచిస్తాం అంటూ టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే గుడ్డిగా హావిూలు ఇస్తున్నారని మండిపడ్డారు. రూ.కోటి సీడీఎఫ్ నిధులపై గత పాలకులు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇవ్వలేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.3కోట్ల సీడీఎఫ్ నిధులపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. గతంలో అధికారపార్టీ ప్రజాప్రతినిధులకే నిధులు ఇచ్చేవారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట కూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు. గతంలో భూపంపిణీకి రూ.92కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ. 500 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. లక్షా 9వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఈటల తెలిపారు. మరో 40వేల ఉద్యోగాల భర్తీ పక్రియ కొనసాగుతోందన్నారు. మహాకూటమికి అధికారమిస్తే తెలంగాణకు మళ్లీ పాత రోజులే వస్తాయన్నారు. కాబట్టి ప్రతిఒక్కరూ ఆలోచించి ఓటేయ్యాలి అని ఈటల రాజేందర్ కోరారు.
కూటమి కుట్రలను తిప్పి కొట్టాలి




