Wednesday, 4 November 2026

మ‌న‌కు తెలియ‌ని సావిత్రి మ‌రో కోణం

జ‌నంసాక్షి:
నేను రేపల్లె స్టేట్ బ్యాంకు  లో  1972 నుండీ 1984 వరకు  పని చేసాను .అప్పుడు Correspondent  S S G H School వడ్డివారిపాలెం పేర  మా బ్యాంకు లో Current Account ఉండేది . S S G H  School  అంటే శ్రీమతి సావిత్రి గణేశన్ హైస్కూల్ అని అర్ధం.
సావిత్రి గారు తన స్వగ్రామములో పేద విద్యార్ధుల  సౌకర్యార్ధం  స్థాపించిన స్కూల్ అది .
కేవలం సావిత్రి  గారి ఆర్ధిక సహాయముతోనే స్థాపించబడిన స్కూలు అది .
ఆ  తర్వాత ప్రభుత్వము  వారిచే గుర్తించబడి , కొంత ఆలస్యముగా  ప్రభుత్వము  వారిచే ఉపాధ్యాయులకు నెలసరి జీతములు  విడుదల చేయబడుతూ నడపపడుతున్న స్కూలు అది .గవర్నమెంటు  గ్రాంటు లేకపోతే  ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందేవి కావు .
వారి స్కూలు తరఫున ఉద్యోగి  తమ  స్టాఫ్ జీతములందరి చెక్కు మార్చుకొనడానికి మా బ్యాంకుకు వచ్చే వారు .
సావిత్రి  గారి మీద ఉన్న అభిమానముతో  ఆ ఉద్యోగులను పలకరిస్తుండే వాడిని .
షుమారు అయిదు నెలలు మా బ్యాంకు  తో పని పడక ఆ స్కూలు వారెవరూ  మా బ్యాంకు కు రాలేదు .
ఒక రోజు నేను మా బ్యాంకు లో Current Account Counter లో పని చేస్తున్నప్పుడు  ఆ స్కూలు ఉద్యోగి  సావిత్రి గారి సంతకముతో ఉన్న  రూ.104000 /_  రూపాయల మద్రాసు  ( ఇప్పుడు చెన్నై ) చెక్కు క్లియరెన్స్ కోసము తమ ఖాతాలో జమ చేయడానికి  తీసుకుని వచ్చారు .
1975 ప్రాంతంలో  రూ. 104000 /- అంటే  ఈ రోజుల్లో  షుమారు రూ. 40 లక్షలు పైనే .మామూలుగా ఆ ఖాతాలో గవర్నమెంటు  బిల్లు జమ చేయబడ్డాక Correspondent సంతకం చేసిన చెక్కు ద్వారా డబ్బులు Withdraw చేసుకుంటారు . అదీ Regular గా జరిగే  Procedure.
దానికి  భిన్నంగా  సావిత్రి  గారి సంతకముతో తమ స్కూలు ఖాతాలో జమ చేయడానికి చెక్కు రావడంతో ఆసక్తి ఆపుకోలేని నేను ” ఇదేమిటి సర్ !!  రొటిన్ కు భిన్నంగా  సావిత్రి  గారి సంతకముతో చెక్కు తెచ్చారు ? ” అని అడిగాను . దానికి  అతను ” ఈ మధ్య సావిత్రి  గారు స్కూలు ఎలా నడుస్తోంది ? అని  మా Corrspondent గారిని ఫోనులో అడిగారు సర్ . దానికి మా Correspondent గారు అయిదు నెలల నుండీ ప్రభుత్వ గ్రాంటు లేక పని చేసే ఉపాధ్యాయులకు , సిబ్బందికి జీతాలు లేవమ్మా  తిండికి  లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా  అని చెప్పారు. ఆ విషయం విన్న సావిత్రి  గారు Correspondent గారిని వెంటనే  మద్రాసు రమ్మన్నారు .  మా Correspondent  గారు వెంటనే మద్రాసు వెళ్ళారు .
సిబ్బందికి  అయిదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సావిత్రి గారు ఎంతో కదిలిపోయి తన స్వంత డబ్బులు రూ. 104000 /- మొత్తం  అయిదు నెలలు బకాయిలకు చెక్కు రాసిచ్చి ముందు సిబ్బంది  బకాయిలు చెల్లించండి. తర్వాత గ్రాంట్ సంగతి మనం చూసుకోవచ్చును  అని అన్నారు సర్. ” అని నాకు చెప్పారు . ఇంతకన్నా ఆ మహాతల్లి దాతృత్వానికి నిదర్శనం ఏం కావాలి ?