Tuesday, 3 November 2026

యాదాద్రి మందిర గోడలపై అసంబద్ద చెక్కడాలు

నీతిమాలిన దగుల్బాజీ చర్యకు పరాకాష్ఠ
హైందవాన్ని కించపరిచే దుర్మార్గం
కిషన్‌ రావు వివరణ మరీ దుర్మార్గం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌7 (జనం సాక్షి ) :   యాదాద్రి ఆలయంలో శిల్పాలు ఇప్పుడు దుమారం రేపుతున్న క్రమంలో ఇందుకు కారకులెవరన్నది తేలాలి. దేవాలయ శిల్పాలపై నేతల బొమ్ములు చెక్కుతారా అన్నది ఆలోచన చేయాలి. చార్మినార్‌,పీర్ల రూపాలు,నాయకుల రూపాలు, కెసిఆర్‌, కారు గుర్తులు చెక్కడం దగుల్బాజీ చర్య తప్పమరోటి కాదు. ఇది పాలకులు చెప్పినా తప్పకుండా ఖండనార్హమే. గుడిని నిర్మించడం అంటే ఓ మంచి ప్రయత్నం జరుగుతున్నదని ప్రజలంతా సంతోషిస్తున్న వేళ ఇలాంటి నీచ పనులకు ఒడిగట్టడం దారుణం కాక మరోటి కాదు. దేశాలయ సంస్కృతిని తెలుసుకోలేని మూర్ఖులు చేసిన పనిగా చూసి ఊరుకోరాదు. యాదాద్రిలో అష్టభుజి మంటప పిల్లర్లపై సీఎం కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎన్నికల చిత్రమైన కారు, కేసీఆర్‌ కిట్టు, ఓటు వేయడానికి ఉపయోగించే స్వస్తిక్‌ స్టాంపు ముద్ర చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. వీటిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్‌, బీజేపీ, విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు కొండపైకి చేరుకుని నిరసనకు దిగారు. కొందరు కార్యకర్తలు ఉత్తర రాజగోపురం పైకి ఎక్కి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కిందికి దించారు. దేవస్థానంలో జరుగుతున్న పనుల వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్ట భుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాల పై సీఎం కేసీఆర్‌ చిత్రం, టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు అయిన కారు, అన్యమత చిహ్నాలను చెక్కించడాన్ని ప్రజలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు.అది
ప్రచార కాంక్ష మాత్రమే కాకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీయడంగానే భావించాలి.  వైభవోపేతమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రాశస్త్యాన్ని భంగపర్చడం, తప్పుదోవ పట్టించడమే అవుతుంది.ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు హిందూయేతర మతానికి చెందిన చార్మినార్‌ను చిత్రించడం దుర్మార్గం కాక మరోటి కాదు. ఫలానా బొమ్మలను చెక్కాలని శిల్పులకు ఎవ్వరూ చెప్పలేదని వైటిడిఎ వైస్‌ ఛైర్మెన్‌, ప్రత్యేకాధికారి కిషన్‌ రావు చేసిన ప్రకటన ఆయన దౌర్భాగ్యానికి నిదర్శనంగా చూడాలి.కెసిఆర్‌ బొమ్మ చెక్కడంపై ఎవరి ప్రోద్భలం లేదన్న ఆయన ఇలాంటివి ఎందుకు చెక్కారో సహేతకమైన కారణాలు ఇవ్వలేదు.  ఏ ఆలయం పైనైనా అప్పటి పరిస్థితులు ప్రతిబింబించేలా ప్రతిమలు చెక్కడం సహజమని తెలిపారు. అ¬బిలం శిలలపై ఆ శిల్పి తల్లిదండ్రులతో పాటు గాంధీ, నెహ్రూ బొమ్మలు ఉన్నాయన్నారు. అభ్యంతరాలుంటే కెసిఆర్‌ బొమ్మను తీసేస్తామన్నారు. గుడిలో ఒక్క కారు చిహ్నం లేదని, అన్ని రకాల చిహ్నాలు ఉన్నాయని స్పష్టతనిచ్చా రు. కారు మాత్రమే కాదని, ఎడ్లబండి, సైకిల్‌, పద్మం కూడా ఉన్నాయన్నారు. ఆలయానికి వాస్తు ఉందా లేదా అని మాత్రమే చూస్తారన్నారు.
భవిష్యత్‌ తరాలకు ఇప్పటి పరిస్థితులు చూపించాలనే ఉద్దేశ్యం తోనే కొన్ని చిహ్నాలు శిల్పులు చెక్కామని సమర్థించుకోవడం ఆయన మానసిక దౌర్బల్యం కాక మరోటి కాదు.  యాదాద్రి ఆలయానికి ఎంతో పవిత్రత ఉందని, ఆలయం త్వరగా పూర్తి చేయాలని శిల్పులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆలయ బొమ్మలపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కృష్ణశిలలపై చెక్కిన బొమ్మలు చెక్కు చెదరవని వివరించారు. చరిత్రను తెలియజేసేందుకే ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారని చెప్పడం, సిఎం కెసిఆర్‌ను దేవుడిగా భావించిన శిల్పి హరిప్రసాద్‌ ఆయన ప్రతిమను చెక్కారని ఆనంద్‌సాయి తెలిపడం ద్వారా హైందవాన్ని కించపరిచారు. వీరు ఆ పదవుల్లో ఉండి పునర్నిర్మానంలో కొనసాగడం మన దౌర్భాగ్యం.
———-