టిఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వ్యాఖ్యలు
ఇద్దరి వ్యాఖ్యలపై ఇంటిలిజెన్స్ ఆరా?
హైదరాబాద్,సెప్టెంబర్7 (జనం సాక్షి ) : టిఆర్ఎస్లో అసంతృప్తి మెల్లగా రాజుకుంటోంది. ఉద్యమకారులను విస్మరిస్తున్నారన్న భావన అంతర్లీనంగా అంటుకుంటోంది. తమను నిర్లక్ష్యం చేస్తున్నారన బాధ అందరిలోనూ ఉంది. ఇటీవల జరుగుతన్న పరిణామాలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఈటెల రాజేందర్,రసమయి బాలకిషన్‌లు బయటకి కనిపిస్తున్న వ్యక్తులు మాత్రమే బయటకు కనపడిని ఎందరో ఆవేదన వారిద్దరి వ్యాఖ్యల రూపంలో వస్తున్నదని ఇక్కడ గమనించాలి. నిజానికి ఉద్యమంతో సంబంధం లేనివారిదే ఇప్పుడు పెత్తనమంతా. తెలంగాణ ప్రజల్లో కూడా ఇదే భావన ఉంది. ఓ వైపు యూరియ ప్రకంపనలు, మరోవైపు యాదాద్రి దేవాలయ శిల్పాలపై అభ్యంతరకర చెక్కడాలు, ఇంటర్ విద్యార్థుల మరణమృదంగం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పరంగా అనేక వైఫల్యాలు కనిపిస్తున్నాయి. వీటిని పట్టించుకోవాలన్న ధ్యాస పాలకుల్లో కాన రాకపోవడం అన్నది కూడా ప్రజల్లో ఆలోచింపచేసే అంశంగానేచూడాలి. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న కరీంనగర్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్లో ఉద్యమ నేపథ్యం అనే ఈటెల మాటలు తూటాల్లా దూసుకుని పోతున్నాయి. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులతో మంత్రి చర్చించారనే వార్తల పై ఇటీవల హుజూరాబాద్‌లో ఘాటుగా స్పందించిన మంత్రి ఈటల రాజేందర్‌కు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన మాటలతో బాసటగా నిలవడం ఏ పరిణామాలకు దారితీస్తోందోననే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈటల హుజూరాబాద్‌లో చేసిన ఘాటైన వ్యా ఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరునాడే హైదరాబాద్ వెళ్లి ఈటలను కలిశారు.దీనిపై పత్రికలు, టీవీలు, సోషల్విూడియాల్లో రకరకాల కథనాలు వెలువడిన నేపథ్యంలో నిఘావర్గాలు ఈ విషయమై ఆరా తీస్తున్నాయి. సమావేశానికి సంబంధించిన పూర్తి రికార్డులను ఇంటలిజెన్స్ వర్గాలు సేకరించినట్లు సమాచారం. వీరిద్దరూ సర్కారు వైఖరికి భిన్నంగా గొంతు విప్పడంలో గల ఆంతర్యం ఏంటనే విషయాలను ఆరా తీసిన నిఘా వర్గాలు నివేదికను సర్కారుకు పంపించినట్లు సమాచారం. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ యంత్రాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత మాట్లాడిన రసమయి బాలకిషన్ నవ్వుతూ మాట్లాడు తూనే కడుపులో దాచుకోవడం తెలియదంటూనే గట్టిగానే హెచ్చరికలాంటి మాటలు చేశారు. రాజేందరన్న నేను ఉద్యమాల నుంచి వచ్చినోళ్లం. వాస్తవాల విూద ఉద్యమాలు నడిపినోళ్లం. తెలంగాణ రాష్ట్రం ఎట్ల ఉండాల్నో కలలు కన్నోళ్లం. వాస్తవంగా ఒక్కోసారి చాలా బాధనిపిస్తోందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలుగా విశ్లేషిస్తున్నారు. రసమయి వ్యాఖ్యల పై సోషల్ విూడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుం డడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్లో తాజాగా తెరపైకి వచ్చిన ఉద్యమ నేపథ్యం మాటలు ఎటువైపునకు దారితీస్తాయోనన్న ఆసక్తిని రేపుతున్నాయి. 19 ఏళ్ల కిందట తాను టీచర్‌గా పాఠాలు చెప్పిన సిద్దిపేట జిల్లా ఇంద్రగూడెం స్కూల్లో అప్పటికి, ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని, పాఠశాల బోర్డు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు బదులు తెలంగాణగా మా రిందని తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయిందని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు గురుకులాలల వ్యవస్థ విజయవంతమైందని, రెండు మూడు హైస్కూళ్ల ను ఒకటిగా చేసి మినీ రెసిడెన్సియల్ స్కూళ్లు చేయాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని చెబుతూనే… పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడాన్ని సుతిమెత్తగా విమర్శించారు. మంత్రి పదవి భిక్ష కాదు… గులాబీ జెండా ఓనర్లం మేం అనే మాటలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన ఈటల రాజేందర్ గురువారం కలెక్టరేట్లో మాట్లాడుతూ రాజకీయ నాయకులకు సైతం మెరిట్ ఉండాలనే కొత్తటాపిక్ తీసుకురావడం గమనార్హం. సమాజంలో టీచర్‌కు మెరిట్ ఉంటది కలెక్టర్‌కు, డాక్టర్‌కు, ఇంజనీర్‌కు మెరిట్ ఉంటది. కానీ మెరిట్ లేకుండా ఉన్న వాళ్లు కొద్దిమంది రాజకీయ నాయకులు. మెరిట్ ఉండాల్సింది వాళ్లకు ఇవ్వాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి.
ఈటెల మాటల తూటాలు ..రసమయి దరువులు




