యాదాద్రి వద్ద రోడ్డు ప్రమాదం
గూడూరు,డిసెంబరు 24 (జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై మూడు వాహనాలు బీభత్సం సృష్టించాయి. బీబీనగర్ మండలం గూడూరు వద్ద రెండు కార్లు, ఒక వాటర్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా.. మరో నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు వెంకటేశ్, హర్షవర్ధన్ నాయక్, అఖిల్ రెడ్డి, కల్యాన్ రెడ్డి, కార్తిక్, రవి కిరణ్, సాయి చరణ్ ఆలేరులోని మరో స్నేహితుడు సాయికుమార్ సోదరి వివాహానికి వెళ్లారు.వివాహం జరిగిన అనంతరం సాయంత్రం 5 గంటలకు కారులో ఆలేరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్దకు చేరుకోగానే.. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర రహదారిపై మొక్కలకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనక నుంచి వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న అఖిల్ రెడ్డి, హర్షవర్ధన్ నాయక్, సాయి చరణ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంకటేశ్, కల్యాణ్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, రవి కిరణ్ కారులోనే ఇరుక్కుపోయారు. ఎంత ప్రయత్నించినప్పటికీ అందులో నుంచి బయటకు రాలేక ఆర్తనాదాలు చేశారు. గమనించిన స్థానికులు వారిని అతికష్టం విూద బయటకు తీశారు. అయితే అప్పటికే వారు నలుగురు మృతి చెందారు. మృతులంతా 19 నుంచి 25 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం.ప్రమాదం జరిగిన సమయంలో అదే దారిలో వచ్చిన మరో కారు వెళ్లి యువకులు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. అయితే ఆ కారులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా స్పల్ప గాయాలతో బయటపడ్డారు. టోల్‌ప్లాజాకు దగ్గరగానే ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించి క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు.
రవికిరణ్ ఇంటి వద్ద విషాదఛాయలు
ప్రమాదంలో మృతిచెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రవికిరణ్ నగరంలోని గౌతమ్‌నగర్ డివిజన్ ఇందిరానెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్నాడు. రవికిరణ్ మరణవార్త తెలియగానే గౌతమ్‌నగర్ డివిజన్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా రవికిరణ్ తండ్రి కూడా 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడం గమనార్హం. రవికిరణ్ తల్లి ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తూ పిల్లల్ని చదివిస్తోంది. మృతుడికి ఓ సోదరి ఉంది.