– యాసిడ్ లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్
– ఆరుగురికి గాయాలు
నల్గొండ,అక్టోబర్24(జనంసాక్షి) : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది.. నార్కెట్ పల్లి మండలం ఏపీలింగోటం దగ్గర ఆగిఉన్న యాసిడ్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్ డ్రైవర్ సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. అయితే యాక్సిడెంట్ తర్వాత లారీ నుంచి యాసిడ్ లీక్ కావడంతో హైవేపై దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైరింజన్ ను అందుబాటులో ఉంచారు. లీకేజీని ఆపేందుకు తీవ్రంగా శ్రమించారు. బస్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి మినహా మిగిలిన వారికి పెద్దగా గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.





