Wednesday, 4 November 2026

యువతకు ఆదర్శం రేవయ్య. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, మే 27, (జనంసాక్షి )
నేటి యువత డోంగ్రీ రేవయ్యను ఆదర్శంగా తీసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం ఆయన రెబ్బన మండలం తుంగెడ గ్రామంలో సివిల్స్ లో 410 ర్యాంకు సాధించిన డోంగ్రీ రేవయ్యను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన నేతకాని మహర్ సామాజిక వర్గానికి చెందిన ముద్దు బిడ్డ డోంగ్రీ రేవయ్య నేతకాని కుల చరిత్రలో మొట్ట మొదటి సారిగా ఒక పేద బిడ్డ జాతి చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు, తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తు, పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించి అక్కడినుంచి ఇంజనీరింగ్ మద్రాస్ ఐఐటీలో చదివి తన బిడ్డను దేశంలోనే అత్యున్నత మైన ఉద్యోగం కలెక్టర్ గా ఎదిగేలా చేసిన ఆ తల్లిది మామూలు విషయంకాదన్నారు. ఆమె నమ్మకంను సుసాధ్యం చేసిన డోంగ్రె రేవయ్యను అభినందించారు. నేటి యువత సెల్ ఫోన్ పట్టుకుని సమయాన్ని వృదా చేయకుండా, సమయ పాలన పాటిస్తు, కడుపేదరికం నుంచి కూడా అత్యున్నత చదువు చదువొచ్చు అని, కష్టపడితే ఏదైనా సాధ్యమే అని రేవయ్య నిరూపించాడన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు జాడి నర్సయ్య, బసర్కార్ విశ్వనాధ్, జుమ్మిడి సౌందర్య, డోంగ్రీ మధుకర్, చల్లూరి ధర్మ, జుమ్మిడి ఆనంద్, దుర్గం బండు, దుర్గం భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.