Wednesday, 4 November 2026

యువత కలలు సాకారం చేస్తాం

8

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

విశాఖపట్టణం,జనవరి17(జనంసాక్షి): కొత్త సంవత్సరంలో కొత్త ఆశాలతో విశాఖ ఐఐఎంను ప్రారంభించుకుంటున్నామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. దీనిని జాతికి అంకితం చేస్తున్నామని, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇక్కడ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.  విశాఖజిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎంకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ… గత బ్జడెట్‌లో కేంద్రం ప్రకటించిన విధంగా ఐఐఎంను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఐఐఎం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన విద్యావిధానంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. యువత కలలు సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు చెప్పారు. సుందర విశాఖనగరంలో ఐఐఎం ఏర్పాటుతో ఓ కొత్త శకాన్ని ఆరంభించుకుంటున్నామని  స్మృతి ఇరానీ అన్నారు. ఆంధప్రదేశ్‌ యువత కలలను సాకారం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. బెంగళూరు ఐఐఎం సహకారంతో విశాఖ ఐఐఎం పనిచేస్తుందని మంత్రి ప్రకటించారు. మా అమ్మ విశాఖలో నివశించిన రోజులు నాకు గుర్తుకువచ్చాయనడంతోపాటు మంత్రి స్మృతిఇరానీ తెలుగులో అందరికీ నమస్కారం అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలతో నామమాత్రపు ఫీజుతో సర్టిఫికెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి స్మృతిఇరానీ వివరించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అన్నారు.సుందరమైన విశాఖ నగరానికి హుద్‌హుద్‌ తుపాను నష్టం తెచ్చిందన్నారు. విశాఖ ఐఐఎంకు బెంగళూరులోని ఐఐఎం సిబ్బంది సహకారమందిస్తారని వెల్లడించారు. దేశంలో అందరూ విద్యను అభ్యసించేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *