Monday, 2 November 2026

యువత కోసం టాస్క్ ప్రారంభం

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ బేగంపేటలో టాస్క్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి, లోగోని ఆవిష్కరించారు. స్పష్టమైన లక్ష్యాలతో టాస్క్ ను ప్రారంభించినమని, రాబోయే ఆరు నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కార్పొరేట్‌ కోచింగ్‌ సెంటర్లకు ధీటుగా టాస్క్‌ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో 15 వేలకు పైగా విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చామని వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలో ప్రారంభించబోయే కంపెనీలకు ఉద్యోగులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించి శిక్షణ ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. టాస్క్‌, మనటీవీ, ఈజీజీలతో అన్ని స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లను అనుసంధానం చేస్తామన్నారు. త్వరలో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి తెలిపారు. వారికి అవసరమైన కోచింగ్‌ ను మనటీవీ ద్వారా అందిస్తామన్నారు.
ఇప్పటికే చదువు పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు టాస్క్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటి ఉద్యోగులకే కాకుండా అన్ని రంగాల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. దీనిలో భాగంగా నాస్కామ్ తో పాటు టాస్క్, జేఎన్‌టీయూహెచ్ కలిసి ఇంజనీరింగ్ లోని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో కొత్త సబ్జెక్టుల ప్రవేశానికి చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. డిజైన్ ఇంజనీర్, జూనియర్ డాటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్ వంటి సబ్జెక్టుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఒకే గొడుగు కిందకు తీసుకోస్తామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *