శివ్వంపేట జూన్ 29 జనంసాక్షి : మండల కేంద్రమైన శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన స్థలాన్ని శివ్వంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఆక్రమించి, ఆ స్థలంలో చికెన్ విక్రయ షాపులు నెలకొల్పుతున్నట్లు అందుకు సంబంధించి, భూమి పూజ సైతం చేశారని దీనిని నిర్మూలించి, మండలానికి చెందిన ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం యొక్క స్థలాన్ని కాపాడాలని, అలాగే తమ శాఖ ద్వారా ఈ నిర్మాణాలకు సంబంధించి, ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అట్టి నిర్మాణాలకు ఎవరు కూడా తమను సంప్రదించలేదని స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాయిసౌమ్య పేర్కొంటూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 1న శివ్వంపేట పంచాయతీ కార్యదర్శికి, తహసిల్దార్, ఎంపీడీవో, శివంపేట పోలీస్ స్టేషన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి, జిల్లా పంచాయతీ అధికారి తో పాటుగా పైన పేర్కొన్న అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇదే స్థల వివాదంపై స్థానిక బీఆర్ఎస్ నాయకుడు వారాల గణేష్ ఈనెల 26న మెదక్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను నేరుగా కలిసి కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ బుధవారం శివ్వంపేట గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాల్సిందిగా డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్యను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల 28 న డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్య శివ్వంపేట కు చేరుకొని ఇటీవల నూతనంగా నిర్మించిన మాంసం విక్రయ షాపుల వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన శివ్వంపేట సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ అతడి అనుచరులు కొంతమంది డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్యను చుట్టుముట్టి ఆందోళన చేశారు. మాంసం విక్రయ కేంద్రాల వల్ల స్థానిక గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుందని, వాటిని ఎలా తొలగిస్తారని దుయ్యాబట్టరు. పంచాయతీ డివిజనల్ అధికారి విచారణ జరుగుతుందని తెలుసుకున్న శివ్వంపేట మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి భర్త నవీన్ గుప్తా, మాజీ ఎంపీటీసీ జంగం విజయ భర్త వెంకటేష్ మరికొందరు వారి వర్గం సభ్యులు, అలాగే కొందరు గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఎవరి అనుమాతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మించిన మాంసం విక్రయ కేంద్రాలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగి, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బూతు పరుష పదజాలాలతో తిట్టుకున్నారు. గొడవ జరిగే అవకాశం ఉందని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల వారిని సముదాయించి, అక్కడి నుంచి పంపించి వేశారు. మంత్రి హరీష్ రావు ప్రారంభించిన మాంసం విక్రయ షాపులను కూల్చివేసి, రెండు గదులతో ఉన్న హోమియోపతి ప్రభుత్వ దవాఖానను కూల్చి ఆ వివాద స్థలంలోనే సర్పంచ్ ఈ మాంసం విక్రయ షాపులను నిర్మించడంతోనే వివాదం రాజుకుందని గ్రామస్తులు తెలిపారు.
రణరంగమైన శివ్వంపేట బిత్తరపోయిన డిఎల్పిఓ ఇరువర్గాల తోపులట




