Thursday, 5 November 2026

రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలురాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు

ప్రతిపక్షాలది దిక్కుమాలిన శవ రాజకీయాలు
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా……?
పాత్రికేయుల సమావేశంలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యే రసమయి, పార్టీ అధ్యక్షులు జీవీఆర్
మానకొండూరు, అర్ సి, మార్చి 20 (జనం సాక్షి)
టీ ఎస్ పీ ఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారంలో ప్రతిపక్షాలు దిక్కుమాలిన శవరాజకీయాలు, అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని సిరిసిల్ల ,కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, బీ ఆర్ ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలు ముక్తకంఠంతో ఖండించారు. గోరంత విషయాన్ని కొండంత చేస్తూ అనవసరమైన విషయాలను లేవనెత్తుతూ నిరుద్యోగుల జీవితాల్లో నిరాశ నింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు నిరుద్యోగుల్లో భరోసా కల్పించి, అభ్యర్థులకు మనోధైర్యాన్ని కల్పించాల్సింది మాని, రాజకీయ అంశంగా ఈ వ్యవహారాన్ని కొనసాగించటం సబబు కాదని వారు హితువు పలికారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు క్యాంపు కార్యాలయంలో సోమవారం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల ఆరోపణల పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లకు ఈ విషయానికి సంబంధం ఏమిటో చెప్పాలని వారు నిలదీశారు. ఉద్యోగార్తులను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు. యువతను రెచ్చగొట్టి వారి జీవితాలను నాశనం చేయవద్దని హితువు పలికారు. ప్రతిపక్ష నాయకులు ఏదైనా విషయం మాట్లాడాలి అనుకున్నప్పుడు విషయ విశ్లేషణ జరిపి మాట్లాడాలని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. భాజపా, కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. లీకేజీ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని చట్టానికి అందరూ సమానులేనని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసిందని వారు తేల్చి చెప్పారు.