Thursday, 5 November 2026

రాజారాం లో గుప్త నిధుల కలకలందేవాలయం నిర్మిస్తానని గుప్త నిధులు మాయం చేశారని ఆరోపణ.- రచ్చకెక్కిన వివాదం.- అధికార పార్టీ నాయకుల అండదండతో సద్దుమణిగించిన వైనం.- నిజానిజాలు తేల్చాలంటున్నా స్థానికులు.

 

 

 

 

 

బెల్లంపల్లి, (వేమనపల్లి ),ఏప్రిల్ 14, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలం రాజారాం గ్రామంలో శుక్రవారం గుప్తనిధుల కలకలం రేగింది. రాజారాం గ్రామంలోని ఎల్లమ్మ దేవత విగ్రహాల వద్ద అదే గ్రామానికి చెందిన గ్రామ పెద్ద గుడి నిర్మిస్తానని ఆదివాసులను నమ్మబలికి జేసీబీ సాయంతో విగ్రహాల చుట్టూ తవ్వకాలు జరిపించారని, తవ్వకాలు జరిపి రెండు నెలలు గడిచినా పనులు ఇంకా చేపట్టక పోవడంతో అనుమానం వచ్చిన గ్రామ ఆదివాసీలు పరిశీలించగా దేవత విగ్రహాల వద్ద గుడి నిర్మాణం కోసం కాకుండా గుప్త నిధుల కోసం తవ్వినట్లు ఆనవాలు కనిపించాయని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయం పై పోలీసులకు పిర్యాదు చేయడానికి వెళితే అధికార పార్టీ నాయకులు అడ్డుకొని మనం మనం మాట్లాడుకుందాం, మీకు కావాల్సింది గుడి నిర్మాణమే కదా, మేము దగ్గరుండి గుడి నిర్మాణ పనులు పూర్తి చేయిస్తాం అని ఆదివాసీలకు అభయం ఇవ్వడంతో వారు ఏమీ చెప్పలేక మిన్నకుండి పోయారు.
దేవాలయం నిర్మిస్తానని గుప్త నిధులు మాయం చేశారు.
రాజారాం గ్రామంలోని ఎల్లమ్మ దేవత విగ్రహాలకు పెద్ద చరిత్ర ఉంది. శతవాహనుల కాలంలో ఈ విగ్రహాలు ప్రతిష్టించారని, పూర్వికుల కాలం నుంచి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం ఉంది. కాగా గుడి నిర్మాణం పేరిట ఎల్లమ్మ విగ్రహాల వద్ద ఉన్న గుప్త నిధులు మాయం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపకుంటే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్లిన ఆదివాసీలను అడ్డుకొని పిర్యాదు చేయకుండా ఆపడంలో అధికార నాయకుల ఆంతర్యం ఏమిటి అనే విషయాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజానిజాలు తేల్చాల్సిందే.
రాజారాం గ్రామంలోని ఎల్లమ్మ దేవత విగ్రహాల వద్ద భారీగా గుప్త నిధులు బయటపడ్డాయాని మండల వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా గుప్త నిధులు లభ్యం అయ్యాయా, లభ్యం అయితే ప్రభుత్వానికి స్వాధీన పరచాలని రాజారాం గ్రామస్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.