Thursday, 5 November 2026

రాబోయే వర్షాకాలం సీజన్ లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

టేకులపల్లి, జూన్ 9 (జనం సాక్షి): రాబోయే వర్షాకాలం సీజన్లో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను మండల వ్యాప్తంగా విస్తృతంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దోమలు పెరిగే స్థలాలు అయిన నీటి నిల్వలు ఉన్న కూలర్లు, ఫ్రిడ్జ్ లు, కొబ్బరి బోండాలు, టైర్లు,పాడుబడిన గాబులు, కుండలు, రోళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, పూల కుండీలు, కూల్ డ్రింక్, బీరు సీసాలు పరిశుభ్రం చేయని మురికి కాలువలు తదితర వాటిల్లో నిల్వ ఉన్న మంచి నీటిలో డెంగ్యూ చికెన్ గున్యా లకు కారణమైన టైగర్ దోమ విస్తృతంగా పెరుగుతుంది అన్నారు. రాబోయే వర్షాకాలం లో దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులైన డెంగ్యూ, చికెన్ గున్యా,మలేరియా, మెదడువాపు, బోదకాలు తదితర వ్యాధుల బారిన ప్రజలు పడకుండా దోమ పుట్టకుండా, దోమ కుట్టకుండా ఉండడానికి పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు ఇంటి ఇంటికి తిరిగి వైద్య సిబ్బంది ద్వారా ప్రతి శుక్రవారం, మంగళవారం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రాబోయే వర్షాకాలంలో వచ్చే అంటు వ్యాధులైన టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు, కామెర్లు తదితర వ్యాధులపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరు తెన్నులను పరిశీలించడానికి ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ నంద్యాతండా, నారాయణతండా చుక్కాలబోడు, రేగుల తండా తదితర గ్రామాలలోఆకస్మి కంగా తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.