Tuesday, 3 November 2026

రామకృష్ణ హత్య కేసులో దోషులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షించాలి

బచ్చన్నపేట(జనం సాక్షి) ; సుపారీ గ్యాంగ్తో ఇటీవల కిడ్నాప్ చేయబడి హత్య గావించబడిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామ కృష్ణయ్య కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జాయింట్ సెక్రెటరీ పి.జితేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో మృతుడు నల్ల రామకృష్ణయ్య కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా సంఘం జాయింట్ సెక్రటరీ జితేందర్ మాట్లాడుతూ స్థానిక పేద ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామ కృష్ణయ్యను కిడ్నాప్ చేసి హత్య చేయడం దారుణమని, మృతికి పాలకులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్నారు. రామకృష్ణయ్య ఎంపీడీఓ గా రిటైర్డ్ అయిన తర్వాత పేద ప్రజలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో పని చేస్తున్న క్రమంలో హత్య గావించ బడడం పేద ప్రజలకు తీరని లోటన్నారు. అన్యాయం జరుగుతున్న చోట న్యాయం జరగాలని ఆర్టిఐ ద్వారా ప్రశ్నించడం నేరమా..? అని ప్రశ్నించారు. న్యాయాన్ని కాపాడాల్సిన పాలకులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి నల్ల రామకృష్ణయ్య మృతికి కారణమయ్యారని ఆరోపించారు. మృతుని కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి శోక సముద్రంలో మునిగిపోయిందన్నారు. నల్ల రామకృష్ణయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించకపోవడం, సంఘటనలో కీలకంగా మారిన నాయకులను తప్పించడానికి చూస్తున్నట్లుగా అర్థం చేసు కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల రామకృష్ణయ్య మృతి కేసులో ఎలాంటి అవకతవకతలు జరగకుండా పాలకులు, పోలీసులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మృతికి కారణమైన దోషులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షించా లని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు నల్ల రామకృష్ణ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించి, కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించా లని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం జనగామ జిల్లా నాయకులు నగేష్,, ప్రశాంత్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.