రిజిస్ట్రేషన్లు షురూ..

రోజుకు 24 స్లాట్లు మాత్రమే: సోమేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌,డిసెంబరు 11 (జనంసాక్షి): ధరణిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రూ. 200 చెల్లించి విూసేవ కేంద్రాల్లో స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ల శాఖలో 4,143 లావాదేవీలు జరిగాయి. స్లాట్ల బుకింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 85 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. బిల్డర్లు, డెవలపర్ల కోసం పోర్టల్‌లో ప్రత్యేక విండో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 451 మంది బిల్డర్లు 93 వేలకు పైగా కొత్త ఆస్తులను అప్‌లోడ్‌ చేశారు. రూ.12,699 టిపిన్స్‌ను స్థానిక సంస్థలు కేటాయించాయి. పోర్టల్‌ ద్వారా సులువుగా డాక్యుమెంట్‌ కూడా తయారు చేసుకునే అవకాశముంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను శుక్రవారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.

స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన సీఎస్‌

రాష్ట్రంలో నూతనంగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ అన్నారు. ఈ విధానంలో రిజిస్ట్రార్లు సహా అధికారులెవరికీ ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవని సీఎస్‌ స్పష్టం చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్లు మాత్రమే బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్‌ సంఖ్య ఇవ్వని వారికోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆన్‌లైన్‌లో మ్యుటేషన్‌ వెంటనే జరుగుతుందని.. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత వెంటనే డాక్యుమెంట్లు ఇస్తామని.. ఈ-పాస్‌బుక్‌, ఆరెంజ్‌ రంగు పాసుపుస్తకాలు కూడా జారీ చేయనున్నట్లు సీఎస్‌ వివరించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ లేనివారి విషయంలో కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎస్‌ తెలిపారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. పెండింగ్‌ మ్యుటేషన్లు ధరణిలో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గతంలో 16 లక్షల లావాదేవీలు జరిగితే వాటిలో 10 వేలు మాత్రమే స్లాట్‌ బుకింగ్‌ ద్వారా జరిగేవని.. ప్రస్తుతం వంద శాతం స్లాట్‌ బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సోమేశ్‌ కుమార్‌ వివరించారు. దాదాపు 96 శాతం సేవలు ప్రారంభించామని.. మిగతావి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని సీఎస్‌ వెల్లడించారు.డేటా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు సీఎస్‌ తెలిపారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు 100 మంది అధికారులు, నిపుణులతో బీఆర్కే భవన్‌లో వార్‌ రూం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి 24 గంటల కాల్‌సెంటర్‌ సేవలు అందుబాటులో ఉంటాయని.. 1800-599-4788 నంబర్‌కు కాల్‌ చేసి సమస్యలు వివరించవచ్చని సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.