తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని దేశ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు.




