సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 26కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ మట్టిని అక్రమంగా మట్టి మాఫియా తరలిస్తున్నా వైనం హత్నూర మండలంలో నీ మాదరం గ్రామ శివారులో జరుగుతుంది. అయితే మామూళ్ల మత్తులో అధికారులు చర్యలు తీసుకోడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. గోరంత అనుమతి పొంది కొండంత తవ్వకాలు జరుపుతున్న చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హత్నూర మండల పరిధిలోని మాదారం గ్రామం డాంపర్ చెరువులో కొన్ని వేల టన్నుల మట్టి ఇటుకల తయారీ కోసం రాయల్టీ కట్టి ఇప్పటికే దాదాపు లక్షల టన్నులకు పైగా మట్టి తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుకల తయారీ కోసం అనుమతి పొంది మట్టి ఇటుక బట్టీలు తరలించాల్సి ఉంది. కానీ చెరువు సమీపంలోని వ్యవసాయ పొలాల్లో చెరువు మట్టిని గుట్టలుగా నింపినా అధికారుల కళ్ళకు మాత్రం కానరావడం లేదు. ఒక చెరువులో ఇంత పెద్ద మొత్తంలో మట్టిని తీయడం తాము గత 20 సంవత్సరాలుగా ఎన్నడూ చూడలేదని స్థానికులు పేర్కొనడం విశేషం.
రోజూ వందలాది టిప్పర్ ల తోపాటు ఇప్పటికే కొన్ని లక్షల టన్నులకు పైగా మట్టిని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుమ్మడిదల మండల పరిధిలోని అన్నారం ఇటుక బట్టీలు, దుండిగల్ ఇటుక బట్టీలకు మట్టిని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న మట్టి వ్యాపారులు. రాత్రిపూట అక్రమస్ మట్టి రవాణా టిప్పర్లు అతివేగంగా నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలలో ఎన్నో ఉన్నాయి. చెరువులో మట్టి పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించిన మార్గదర్శకాలను తుంగలోతొక్కి మట్టి మాఫియా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ఓవర్ లోడ్ తో పాటు రాత్రిపూట మట్టిని తరలిస్తున్నా రవాణా శాఖ సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం ఎంతమేర మామూలు ముట్టాయో తెలిపేందుకు నిదర్శనం. ఈ వ్యవహారం అంతా అధికార పార్టీకి సంబంధించిన ఓ జెడ్పిటిసి కనుసన్నుల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యాపారులు మట్టి మాఫియాగా చెలరేగిపోతున్నారని స్థానికుల ఆరోపణ. సంబంధిత అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు స్థాయిని బట్టి మట్టి మాఫియా జేబులు నింపిందని, ఖద్దరు చొక్కా వేసుకున్న అధికార, ప్రతిపక్ష నాయకులకు సైతం పెద్ద ఎత్తున మామూళ్లు ముట్ట చెప్పారని సమాచారం. మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మట్టి అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది





