రైతులకు వ్యవసాయానికి సరిపడా ఉచిత కరెంటు ఇస్తాం
జనంసాక్షి , మంథని : రైతులకు వ్యవసాయానికి సరిపడా ఉచిత కరెంటు ఇస్తాం – కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం – బిజెపి కక్ష సాధింపు చర్యల్లో రాహుల్ గాంధీకి అండగా ఉంటాం – సత్యగ్రహ మౌన దీక్షలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.
రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని , రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తాం అని ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పై కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పై ఆనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను నిరసనగా గాంధీభవన్ లో చేపట్టిన సత్యాగ్రహ మౌన దీక్షలో ఎఐసిసి సెక్రటరీ, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ, ఖర్గే నేతృత్వంలో తెలంగాణలోని రైతాంగానికి ఉచిత కరెంటు అందిస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని రైతులకు సూచించారు.