బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి)వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి పెట్టుబడి అనేది ఎంతో ముఖ్యమైన మార్గం, అదేవిధంగా గ్రామీణ రుణాగ్రస్తుల విషవలయాన్ని ఛేదించడమే కాకుండా, రైతులకు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు గాను 2018-19 ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి రైతు ప్రాథమిక పెట్టుబడి అవసరాలను దృష్టిలో వుంచుకునే విధంగా నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం (రైతు బంధు) అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రూ.12,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. రుణమాఫీ భారం నుంచి రైతులను విముక్తి చేసి, మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి మద్దతు వ్యవసాయం, ఉద్యాన పంటలకు ప్రతి సీజన్ లో ఎకరానికి రూ.5,000 చొప్పున విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు తదితర పెట్టుబడులు రైతులకు అందించే విధంగా రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.కానీ ఈ పథకం పేద రైతులకు కాస్త ఊరట లభించినా పెద్ద పెద్ద భూస్వాములకు అధిక మొత్తంలో ప్రభుత్వ ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వృధా ఖర్చు అవుతోందని జనం అనుకుంటున్నారు. పెద్ద పెద్ద భూస్వాములు తమ భూములను కౌలుకు ఇచ్చి ఇటు సంవత్సరానికి ప్రతి ఎకరానికి 20 నుండి 50 వేల రూపాయిలు తీసుకొని అటు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పథకం సైతం లాభం పొందుతున్నారు.
పెద్ద పెద్ద భూస్వాములకు గాకుండ చిన్న చితకా రైతులకు మరియు ఐదు పది ఎకరముల రైతులకు రైతు బంధు పథకం అమలు చేయాలని, అదేవిధంగా భూమి లేని వారికి రేషన్ కార్డు ఆధారంగా రేషన్ బంధు పథకం అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు. భూమి ఉన్నవాళ్లకు రైతుబంధు పేరు మీద, లక్షల, కోట్ల రూపాయలు ఇస్తున్నారు. భూమిలేని వారు జనాభా లెక్కలో లేరా అని ప్రశ్నిస్తున్నారు. రైతు బంధు పథకానికి లిమిట్ పెట్టి, పేద ప్రజలకు రేషన్ కార్డు ఆధారంగా ఏదైనా పథకం పెట్టాలని జనం గుసగుసలాడుతున్నారు. వికలాంగుల, వృద్ధుల ఆసరా పథకం ద్వారా ప్రభుత్వం మనసులు గెలుచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేదల పథకం అమలు చేస్తే రాష్ట్రంలోనే గాకుండ దేశములో సైతం ఇక తిరుగుండదని జనం అనుకుంటున్నారు.




