Thursday, 5 November 2026

రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు

అమలు తీరుపై సర్వత్రా హర్షామోదాలు
అధ్యయనం కోసం కెసిఆర్‌ పథకాలు
హైదరాబాద్‌,మే9(జ‌నం సాక్షి): తెలంగాణలో ఇప్పటికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమల
వుతున్నాయి. ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నాయి. ఒక్కో పథకాన్ని పట్టాలకెక్కించి ముందుకు సాగుతున్నారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి వ్యవసాయరంగంలో ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.17వేల కోట్ల రుణమాఫీతో తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించారు. రైతు అవసరాలు ఎరిగి.. ప్రణాళికాబద్ధంగా వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అవస్థలపాలు చేసిన కరంటు కష్టాలు మూడేండ్లలో పూర్తిగా మటుమాయమయ్యాయి. సాగుకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా ఒక్కటొక్కటిగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. ఓవైపు పెట్టుబడికి చేయూత, మరోవైపు గిట్టుబాటు ధర వచ్చేలా రైతుసంఘాల ఏర్పాటుతో దేశ వ్యవసాయరంగానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి అలుపెరుగక ముందుకు వెళుతున్నారు. ఏండ్ల తరబడి బీళ్లయిన భూములను ఆకుపచ్చగా మార్చడంలో కేసీఆర్‌ అనుసరించిన వ్యూహాలు, అన్నదాతలకు అండగా నిలుస్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. రైతుల్లో ఆనందో త్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరానికి రూ.4వేల పెట్టుబడి నిర్ణయంతో సీఎం కేసీఆర్‌ దేశ వ్యవసాయరంగంలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. సాగునీరు.. సకాలంలో సబ్సిడీపై ఎరువులు, విత్తనాల సరఫరా, పండిన పంటను దాచుకునేందుకు సరిపడా గోదాంల నిర్మాణం.. పంటలు ఎండకుండా పచ్చని పైర్లు కండ్ల చూసేలా 24 గంటల ఉచిత కరంటు సరఫరా.. ఇలా రైతన్నకు అనేక విధాలుగా అండగా ఉంటూ వస్తున్నారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ సర్కార్‌ వ్యవసాయరంగం కోసం తీసుకున్న చర్యలకు సర్వత్రా హర్షామోదాలు లభిస్తున్నాయి. సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖలను బలోపేతం చేసేలా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా ఏఈవో పోస్టులను భర్తీ చేసింది.  2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. రూ.48,043 లక్షలు బ్యాంకుల ద్వారా చెల్లించింది. తర్వాత వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు రూ.82186.45 లక్షలు ఇచ్చింది.  రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి దీనిపై పలుమార్లు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర సూక్ష్మనీటి సేద్య పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం రాయితీ.. చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీ.. ఇతరులకు 80శాతం సబ్సిడీపై డ్రిప్‌ సదుపాయం కల్పిస్తున్నది. గతంలో ఈ పథకంలో గరిష్ఠంగా ఒక ఎకరాకు రూ.లక్ష మాత్రమే సబ్సిడీగా లభించేంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ సబ్సిడీ మొత్తాన్ని గరిష్ఠంగా రూ.6లక్షలకు పెంచారు. కూరగాయల విత్తనాలకు ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తున్నది. క్రాప్‌ కాలనీలను గుర్తించి రాష్ట్రాన్ని పండ్లు, పూలు, కూరగాయల సాగులో స్వయంసమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించింది. నల్లగొండలోని గంధవారిగూడెంలో బత్తాయి మార్కెట్‌ ప్రారంభానికి సిద్ధమైంది. నకిరేకల్‌లో నిమ్మ రైతులకోసం రూ.3.07కోట్లతో నిమ్మ మార్కెట్‌ మంజూరు చేశారు. పనులు పురోగతిలో ఉన్నాయి. పీఏపల్లి మండలం కొనమేకలవారి గూడెంలో దొండ ప్రత్యేక మార్కెట్‌ ఏర్పాటుకు రూ.60.30 లక్షలు మంజూరయ్యాయి. దేశచరిత్రలో ఎక్కడా చేయనివిధంగా దాదాపు 36 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.17వేల కోట్ల రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకున్నది. పొరుగు రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌లోనూ చంద్రబాబునాయుడు సర్కార్‌ రుణమాఫీ హావిూ ఇచ్చినా అక్కడ మొత్తం రూ.24వేల కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ.11వేల కోట్ల
మేర మాత్రమే మాఫీ అయ్యాయి.