Sunday, 8 November 2026

రోడ్డు వెడల్పు కోసం కసరత్తు షురూ

రోడ్డు వెడల్పు కోసం కసరత్తు షురూ

రోడ్డు మధ్యలో నుంచి రెండు వైపులా 100ఫీట్స్

మున్సిపల్ కమిషనర్ వెంకన్న వెల్లడి

షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ శ్రీశైలం యాదవ్ తదితరుల పరిశీలన

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పాత హైవే రోడ్డుకు మహర్దశ రాబోతుంది. పాత హైవే రహదారి మధ్యలో నుండి రెండు వైపులా 100 ఫీట్స్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. గురువారం షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న పట్టణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం యాదవ్ తదితరుల అధికార బృందం పాత హైవే రోడ్డులో పరిశీలించింది. రోడ్డుకు ఇరువైపులా 100 ఫీట్ల వరకు నిర్మాణాలు తొలగించి రోడ్డు వెడల్పు ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు భవన యజమానులకు తెలిపారు. షాద్ నగర్ పట్టణ ప్రారంభం నుండి వై జంక్షన్ వరకు 100 ఫీట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడుతున్నట్లు కమిషనర్ వెంకన్న తెలిపారు.

అభివృద్ధికి సహకరించండి – ఎమ్మెల్యే అంజయ్య విజ్ఞప్తి

షాద్ నగర్ పట్టణాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలో పాత హైవే రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని మీడియా సమావేశంలో వెల్లడించిన సంగతి విధితమే. షాద్ నగర్ పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించేవారు ప్రభుత్వ అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.. కేపీ