కాంగ్రెస్ నేతలదే బాధ్యతన్న టిఆర్‌ఎస్
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): అన్నదమ్ముల్లా ఉన్న లంబాడీ, ఆదివాసుల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఏం సందేశం ఇస్తోందని టీఆర్‌ఎస్ కార్యదర్శి ఎల్.రూప్ సింగ్ ప్రశ్నించారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఉద్యమం చేసిన సోయం బాపురావు, ఆత్రం సక్కులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతోందని చెప్పారు. కాంగ్రెస్ కూడా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించినందుకే బాపురావు, సక్కులకు టికెట్లు ఇస్తోందా? అని ఆయన నిలదీశారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో రూప్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరిన రాములు నాయక్, బాలు నాయక్, రమేష్ రాథోడ్ కూడా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే డిమాండ్ కు మద్దతు పలుకుతున్నారా? అని రూప్ సింగ్ ప్రశ్నించారు. ఆదివాసులు, లంబాడాల మధ్య చిచ్చుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని తేట తెల్లమయ్యిందని రూప్ సింగ్ అన్నారు. లంబాడా తండాల్లోకి ఓట్లు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ వారిని నిలదీయాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ గిరిజనుల పాలిట దేవుడు అని టీఆర్‌ఎస్ సహాయ కార్యదర్శి వాల్యానాయక్ కొనియాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. గిరిజనులంతా ఐక్యంగా టీఆర్‌ఎస్ వెంట ఉండటాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఆదివాసులు, లంబాడాల మధ్య చిచ్చు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని
కుట్రలు చేసినా గిరిజనులు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ కే ఓట్లు వేస్తారని వాల్యా స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుట్రల్లో గిరిజనులు చిక్కుకోరని తేల్చిచెప్పారు.




