ఖరీఫ్‌లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
కమిషనర్ అకున్ సబర్వాల్ వెల్లడి
హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నామని, తేమ విషయంలో కూడా వారికి అన్‌ఇన విధాలుగా సహకారం ఉందని పౌఐరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ చెప్పారు.ఈ ఏడాది ఖరీఫ్‌లో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో
తేమకొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, విన్నోవింగ్ మిషన్లు, టార్పాలిన్లతో పాటు తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వీలైనంత త్వరగా రైసు మిల్లులకు తరలించా లన్నారు. ఇందుకోసం 3,233 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ధాన్య సేకరణకు సంబంధించి ఈ నెల చాలా కీలకమైందన్నారు. దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రత్తమంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్ క్వింటాలుకు రూ. 1770, సాధారణ రకం క్వింటాలుకు రూ. 1750 లభించేలా చూడాలని అన్నారు.
ఇప్పటి వరకు 1491 కొనుగోలు కేంద్రాల ద్వారా 84,624 మంది రైతుల నుంచి 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. కనీస మద్దతు ధర మేరకు రూ. 465.55 కోట్లను ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాలోకి జమ చేశామని తెలిపారు. ఖరీఫ్ ధాన్య సేకరణపై హైదరాబాద్ లోని పౌర సరఫరాల భవన్‌లో జిల్లా పౌర సరఫరాల అధికారులతో అకున్ సబర్వాల్ సవిూక్షించారు. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో అక్కడ నెలకొన్న పరిస్థితులపై అకున్ సబర్వాల్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు వేచిచూసే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తేమ విషయంలో వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు నిజామాబాద్‌లో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు, నల్గొండ-78,949, కామారెడ్డి-74,627, యాదాద్రి భువనగిరి-64,840, కరీంనగర్-38,426 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని అకున్ సబర్వాల్ వివరించారు.




