– ఓట్లకోసం ప్రజలమధ్య చిచ్చు పెడుతున్నారు
– ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
హైదరాబాద్, జూన్29(జనం సాక్షి) : బీజేపీ నేత లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నాడని, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్లాప్ యాత్రలా బీజేపీ యాత్ర మారుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అని కర్నె ప్రశ్నించారు. రామమందిరం నిర్మించి తీరుతాం అని లక్ష్మణ్ చెబుతున్నారని, ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని కర్నె ప్రభాకర్ సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయటమే కాకుండా త్వరగా రైతులకు సాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మరోవైపు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లందించేలా వేగంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని దీంతో ప్రజలు ప్రతిపక్షాలను మర్చిపోతున్నారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. దీంతో ఆందోళనలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నారు




