లబ్ధిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలి
– రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్న వ్యవసాయ తదితర రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ బ్యాంకర్లను కోరారు.మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరికీ రుణాలు అందించాలన్నారు.అర్హులైన వారికి వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాలకు రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగేలా బ్యాంకులు దృష్టి సారించాలని కోరారు.స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకునే పాడి పశువులకు సంబంధించిన రుణాలను వెంటనే మంజూరు చేయాలన్నారు.జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల రుణాలను జాప్యం చేయరాదని, వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని సూచించారు.బ్యాంక్ లలో ఏ స్కీములకు రుణాలు ఇస్తారు, స్కీముల వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బాపూజీ, ఎస్బిఐ ఆర్ఎం కృష్ణ మోహన్,వివిధ బ్యాంక్ ల మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.




