Thursday, 5 November 2026

లోక్ అదాలత్ ల ద్వారా సత్వర న్యాయం – సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్

 హుజూర్ నగర్ జూన్ 10 (జనంసాక్షి): లోక్ అదాలత్ లో రాజీ పడడం ద్వారా సత్వర న్యాయాన్ని పొందవచ్చునని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ తెలిపారు. శనివారం కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో కక్షిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలం పాటు కోర్టుల చుట్టూ తిరిగినా లభించని ఉపశమనం లోక్ అదాలత్ లో కేసులను రాజీచేసుకోవడం మూలంగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే 100 శాతం ఉపశమనం పొందవచ్చునన్నారు. లోక్ అదాలత్ లో జారీ కాబడిన అవార్డు అంతిమమైనదని దానిపై అప్పీల్ కు వెళ్లే అవకాశం లేదన్నారు. దావా కోర్టులో దాఖలు చేసే సమయంలో కక్షిదారులు కోర్టుకు చెల్లించిన కోర్టు ఫీజును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం ద్వారా తిరిగి పొందవచ్చునున్నారు. జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. క్షణికావేశానికి లోనై నేరాలకు పాల్పడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థిక, మానసిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కక్షిదారులు క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. ప్రతి చిన్న విషయానికి కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టులపై పెండింగ్ కేసుల పెనుబారం మోపినట్లు ఉందన్నారు. చిన్న చిన్న విషయాలను గ్రామస్థాయిలో పెద్దమనుషుల మధ్య వర్ధిత్వం ద్వారా రాజీ చేసుకోవాలని సూచించారు. ఈ లోక్ అదాలత్ లో 70 క్రిమినల్ కేసులు, 03 సివిల్ కేసులలో కక్షిదారులు రాజీపడగా కేసులను కొట్టి వేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 350 కేసులలో 7 లక్షల రూపాయల జరిమానాల రూపంలో కక్షిదారులు కోర్టుకు చెల్లించారు. ఇతరతర 309 పెట్టి కేసులలో 13 లక్షల రూపాయలను జరిమానాల రూపంలో కక్షిధారులు కోర్టుకు చెల్లించారు. కాగా హుజూర్ నగర్ స్టేట్ బ్యాంక్ వారు లోక్ అదాలత్ కు వచ్చిన కక్షిదారులకు మధ్యాహ్న భోజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జక్కుల నాగేశ్వరావు, లోక్ అదాలత్ సభ్యులు కాల్వ శ్రీనివాసరావు, కుక్కడపు బాలకృష్ణ, కమతం నాగార్జున, షేక్ సైదా హుస్సేన్, సీఐ రామలింగారెడ్డి, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు పరిధిలోని ఏడు పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు, న్యాయశాఖ, మండల న్యాయ సేవా సంస్థ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.