
వాషింగ్టన్ : అమెరికాలోని బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ప్రాణాంతకమైన వైరస్ తప్పించుకొని భూ వాతావరణంలో కలిసిపోయింది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన లాబరేటరీ నుంచి వైరస్ బయటకు ఎలా వెళ్లిందన్న అంశంపై లూసియానా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా అధికారికంగా ప్రకటించింది. న్యూ ఓర్లియాన్స్కు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవింగ్టన్ నగరంలో ఈ బయోలాజికల్ లాబ్ ఉంది. గత నవంబరు నెలలోనే ఈ వైరస్ ల్యాబ్ నుంచి బయటకు వెళ్లినా ఇంతకాలం ఈ విషయాన్ని అమెరికా అధికారులు గోప్యంగా ఉంచారు. ‘బర్క్‌హోల్డేరియా సూడోమెల్లీ’గా పిలిచే ఈ వైరస్‌ను ‘బయో టెర్రర్ ఏజెంట్’గా పేర్కొనవచ్చని అమిరికా నిపుణులు తెలియజేస్తున్నారు. నేల, నీటి ద్వారా ఈ వైరస్ మానవులకు సోకుతుందని, దానివల్ల ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఇంతవరకు పరిసరాల్లోని ప్రజలకు ఈ వైరస్ సోకినట్టు రుజువు కాలేదని, పరిసరాల్లో నేల, నీటి పరీక్షల్లో కూడా ఈ వైరస్ ఉన్నట్టు తేలలేదని వారు చెబుతున్నారు. ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీకవడం ఆందోళనకరమైన విషయమేనని న్యూజెర్సీలోని రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన బయోసేఫ్టీ నిపుణులు రిచర్చ్ ఎబ్రైట్ వ్యాఖ్యానించారు.
వివిధ రకాల వైరస్‌లకు మందులను కనుగొనేందుకే కోవింగ్టన్ బయోల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని అమెరికా చెబుతున్నా.. బయోవార్ కోసం అమెరికా ఈ ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తోందని, కొత్త వైరస్‌లను సృష్టిస్తోందని ఇస్లామిక్ దేశాలు ఇప్పటికీ ఆరోపిస్తున్నాయి. నేడు ప్రపంచాన్ని భయపెడుతున్న ఎయిడ్స్ మహమ్మారి తొలుత దక్షిణాఫ్రికా కోతుల నుంచే వ్యాపించిందని మెజారిటీ వైద్య నిపుణులు భావిస్తున్నా.. అమెరికా ల్యాబ్ నుంచే ఈ వైరస్ పుట్టుకొచ్చిందని ఇప్పటికి వాదిస్తున్నవారు లేకపోలేరు. బయోవార్ కోసం 1942 నుంచే అమెరికా వివిధ రకాల ప్రాణాంతక వైరస్‌లను సృష్టించడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రచ్ఛన్నయుద్ధం సందర్భంగా అమెరికా, అప్పటి సోవియట్ రష్యా బయోవార్ కోసం పోటీ పడ్డాయి. ముందుగా పంటలను నాశనం చేసే వైరస్‌లను సృష్టించిన అమెరికా ఆ తర్వాత మానవుల ప్రాణాలను తీసే వైరస్‌లను సృష్టించింది. 1969లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బయోవార్ పరిశోధనలకు స్వస్తి చెబుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకే పరిశోధనలు చేయాలన్నారు. ఆయన కృషి వల్లే 1972లో బయోవార్ ప్రయోగాలను నిషేధిస్తూ అంతర్జాతీయ వార్సా ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీనిపై తొలుత అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలు సంతకాలు చేశాయి. కాలక్రమేణా 20013, ఆగస్టు నాటికి ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశాల్లో 170 దేశాలు సంతకాలు చేశాయి.
బయోవార్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు
-క్రీస్తుపూర్వం ఆరో దశాబ్దం నుంచే బయోవార్లు జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పుడు వైరస్‌పై అంత అవగాహన లేకపోవడం వల్ల ఫంగస్‌ను మాత్రమే ఆయుధంగా ఉపయోగించారు.
-1346లో మంగోలు గెరిల్లాలు ప్లేగు వ్యాధిని ఆయుధంగా వాడుకున్నారు. యూరప్‌లో ప్లేగు వ్యాధి విస్తరణకు వారే కారణమనే ఆరోపణలున్నాయి.
-1789లో సౌత్ వేల్స్‌పై బ్రిటన్ స్మాల్‌పాక్స్‌ను ఆయుధంగా వాడింది.
-1900 సంవత్సరంలో వైరస్‌ను ఆయుధంగా ఉపయోగించడం ప్రారంభమైంది.
-రెండో ప్రపంచయుధ్ధం సందర్భంగా జర్మనీ కొన్ని దేశాలపై బయోవార్‌తో భీతావహ వాతావరణాన్ని సృష్టించింది.




