Wednesday, 4 November 2026

వందశాతం వసూళ్లు లేకుంటే వేటు

aksha

జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి హెచ్చరిక
వికారాబాద్: ఇంటి పన్నుల వసూళ్లల్లో ఈ ఏడాది మార్చిలోపు 50 శాతం వసూలు చేసి లక్ష్యాన్ని ఛేదించాలని జిల్లా పంచాయితీ అధికారి పద్మజారాణి అన్నారు.  గురువారం స్థానిక రవీంద్ర మండపంలో ఈవోఆర్డీలు,పంచాయితీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పన్నుల వసూళ్లపై వారికి దిశనిర్దేశం చేశారు.

గత 3 సంవత్సరాల నుంచి జిల్లాలో రూ.60 కోట్లకు పైగా పన్నులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క ప్రగతి నగర్‌లోనే 90 శాతం వసూలు పూర్తి చేసిన్నట్లు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఎంతో చొరవ తీసుకొని పన్నులు వసూలు చేశారని, మిగతా వారందరూ వారి అడుగుజాడల్లో  నడవాలని హితవు పలికారు. ఇప్పటివరకు 15 నుంచి 20 శాతం వరకే వసూలు చేయడంపై ఆమె పంచాయితీకార్యదర్శులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పన్నులు వసూళ్లు వేగవంతం చేసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రామాల్లో సర్పంచ్‌ల సహకారంతో తప్పనిసరిగా 100 శాతం పన్నులు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.లేనిచో బాధ్యులపై వేటు వేయాల్సి వస్తుందని  హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యదర్శులు పనితీరులో మెరుగైన ప్రతిభను కనబరచడం లేదనే ఫిర్యాదులు చాలాచోట్ల నుంచి తన దృష్టికి  వచ్చినట్లు తెలిపారు.పన్నుల వసూళ్లలో  ప్రజా ప్రతినిధులకు కార్యదర్శులకు మధ్య బేదాభిప్రాయాలు అక్కడక్కడా  తలెత్తిన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

ఇదిలా ఉంటే కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధుల చెప్పిందే వేదంలా నడిచే కొందరు కార్యదర్శులు అక్కడక్కడ ఉన్నట్లు కూడా సమాచారం ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కార్యదర్శులు గ్రామాల్లో ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, ప్రజాప్రతినిధుల సహకారాంతో ముందుకు సాగాలని హితవు పలికారు.

ఎక్కడైతే పన్నుల వసూలు పూర్తి స్థాయిలో జరుగుతుంతో ఆ గ్రామానికే ఎక్కువ నిధులు కేటా యించి పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జీ ఎంపీడీవో నర్సింగ్‌రావు,మోమిన్‌పేట్ ఈవోఆర్డీ అమృత , బంట్వారం ఈవోఆర్డీ లక్ష్మీనారాయణ,ఆయా మండలాల ఈవోఆర్డీలు,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పన్నుల వసూలులో నిర్లక్ష్యం తగదు
తాండూరు రూరల్: ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతం తీసుకుంటున్నారు.. అందుకు తగ్గట్టు పని కూడా చేయురా అంటూ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) పద్మజారాణి పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల వసూళ్లపై మండల పరిషత్ కార్యాలయంలో గురువారం తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీపీఓ మట్లాడుతూ.. పింఛన్ల పంపిణీ సాకుతో పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.  మార్చి నాటికి 50 శాతం గ్రామాల్లో పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు.  పెద్దేముల్ మండలంలో ఇప్పటికీ పన్ను వసూలు ప్రారంభించకపోవడంపై ఈఓపీఆర్డీ సునీత, కార్యదర్శి విశ్వనాథంపై వుండిపడ్డారు.  ఈ- పంచాయతీ పాలనపై కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు. రికార్డులను కంప్యూటర్లలో పొందుపర్చాలన్నారు.

పన్నుల వసూలు డబ్బులను ఎస్టీఓలో జమ చేయాలని కార్యదర్శులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆసరా పథకం పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పింఛన్ల పంపిణీపై త్వరలో ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ శ్రీనివాస్‌రెడ్డి, తాండూరు ఎంపీడీఓ జగన్మోహన్‌రావు, ఈఓపీఆర్డీలు మనోహర్, సునీత, శెట్టి రవి, వ సంతలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *