Wednesday, 4 November 2026

వట్టెం నవోదయ ఆధ్వర్యంలో జి20 పై అవగాహనా సదస్సు

నాగర్ కర్నూల్ ఆర్సీ 13(జనం సాక్షి):వట్టెం జవహర్ నవోదయ విద్యాలయం ఆధ్వర్యంలో జి20 గురించి ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం నాడు జిల్లాస్థాయి అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.నవోదయ ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ రావు హాజరు కాగా,జోతిభా పూలే పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ విఘ్నేశ్వరి,అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.రాజశేఖర్ రావ్ ప్రసంగిస్తూ జి20 ప్రపంచ దేశాల సమాఖ్యకు మన దేశం అధ్యక్షత వహించి,మార్గనిర్దేశం చేయడం ప్రతి భారతీయునికి గర్వకారణమన్నారు.ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ మాట్లాడుతూ జి20 ప్రాధాన్యతను,లక్ష్యాలను,మన దేశ పాత్రను క్షుణ్ణంగా వివరిస్తూ,బలమైన ఆదర్శవంతమైన ప్రపంచ రూపకల్పన,ప్రపంచ దేశాల ఆర్థిక విద్యా వ్యవస్థలను వృద్ది చేయడం,వివిధ దేశాల పరస్పర సహకారం,విశ్వ శాంతి అంతర్జాతీయ అవగాహన తదితర లక్ష్యాల సాధనే ధ్యేయంగా మన దేశం కృషి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు.అలాగే 2020 జాతీయ విద్యా విధానం,జాతీయ FLN(ఫౌండేషన్ లిటరసీ మరియు న్యుమరసి) మిషన్ క్రింద అన్ని స్థాయిల విద్యార్థుల అక్షరాస్యతా స్థాయి పెంపొందించి సర్వతో ముఖాభివృద్ది సాధించేలా మన దేశం పాటుబడుతుందని చెప్పారు.ఇందుకు సంభందించి పలు అంశాలలో ఉపాధ్యాయులకు తర్ఫీదు నిచ్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులు తిరిగి విద్యార్థులకు,సమాజానికి జి20 ఆవశ్యకతను,మన బాధ్యతను తెలియ పరచాలని ఆయన కోరారు.ముందు ముందు పలు పాఠశాలల్లో ఇలాంటీ అవగాహనా శిబిరాలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ తెలిపారు.