చిలప్ చెడ్/ఫిబ్రవరి/జనంసాక్షి :-మండల కేంద్రమైన చిలప్ చేడ్ తో పాటు చిట్కూల్ గ్రామాలలో వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి వరి పంటను పరిశీలించి వరి పంటలో వచ్చే చీడపీడలు, వాటి యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్ లో ముందుగా నాటుకున్న వరి పొలాల్లో కాండం తొలుచు పురుగు మరియు జింక్ లోపం ఉధృతంగా ఉందని గమనించామన్నారు. వాటి నివారణ కొరకు కొందరు రైతులు యూరియా లో డీజిల్ ను కలిపి స్ప్రే చేస్తున్నారని మా పరిశీలన లో తెలిసిందని అలా చేయవద్దు అని సూచించారు. డీజిల్ స్ప్రే చేయడం వల్ల నీటిపై తేటగా ఏర్పడి మొక్క వేర్లకు గాలి అందక మొక్క చనిపోతుందని డీజిల్ స్ప్రే చేయవద్దని సూచించారు. కాండం తొలుచు పరుగు నివారణ కొరకు వరి నాటుకున్న 15 రోజుల లోపు ఎకరానికి కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 4g గుళికలు 8 కిలోలు లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.4% గుళికలు 4 కిలోల చొప్పున వేసుకోవాలని సూచించారు. వరి నాటు వేసిన 25 రోజుల తరువాత పురుగు ను గమనిస్తే కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2gr లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అదేవిధంగా జింక్ లోప నివారణకు చిలేటెడ్ జింక్ 1gr లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో AEO భూపాల్ మరియు రైతులు పాల్గొన్నారు




