Tuesday, 3 November 2026

వర్షాభావ పరిస్థితుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి –   జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,కలెక్టర్ భవేష్ మిశ్రా

జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి జులై 4 (జనంసాక్షి) వర్షాభావ పరిస్థితుల వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకుని కరువు పరిస్థితులు తలెత్తకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి,జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో సకాలంలో సరిపడా వర్షాలు కురవనందున రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లించేలా వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి,జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు.31 అంశాలపై జిల్లా పరిషత్ అధికారులు ఎజెండా రూపొందించగా లంచ్ సమయానికల్లా వ్యవసాయ, ఉద్యానవన,వైద్య, విద్య, విద్యుత్ , పశుసంవర్ధక శాఖలపై కూలంకషంగా సభ చర్చించింది.మిగితా 25 అంశాలలో కొన్నింటిపై తూతూ మంత్రంగా చర్చించిన సభ ఎజెండాలోని కొన్ని శాఖల పనితీరుపై అసలు పట్టించుకోలేదు.వర్షాకాలం ముందే రైతులు పత్తి విత్తనాలు నాటుకున్నారని అడపా కురిసిన వర్షాలతో మొలకెత్తలేదని, దీంతో భారీగా రైతులు నష్టపోయారని మలహర్ మండల పరిషత్ అధ్యక్షుడు మలహల్రావు అన్నారు.అంతేకాకుండా ఇప్పటికే అధిక ధరలు వెచ్చించి గింజలు కొని నష్టపోయిన రైతులకు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు వేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కోరారు.ప్రభుత్వం 100% శాతం సబ్సిడీతో విత్తనాలను రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గత యాసంగి కాలంలో అకాల వర్షాలతో మునిగిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటికీ అందించలేదని మహదేవ్ పూర్ జెడ్పిటిసి గుడాల అరుణ,ఎంపీపీలు మలహల్రావు,పంతకాని సమ్మయ్య లు అధికారులను ప్రశ్నించారు.అలాగే కాటారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా 12 లక్షలు రూపాయలు అక్రమంగా డ్రా చేసి సొంతానికి వాడుకొని పరారైన వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సమ్మయ్య డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో సమాచారం అందించకుండా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారని చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టాను రీతిగా వ్యవహరించడం పై నిలదీశారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు ప్రోటోకాల్ కచ్చితంగా పాటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. పలు శాఖల అధికారులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తూ మండిపడ్డారు.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుందని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. మినీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్యలు పెంచి విద్య బోధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, జెడ్పి సీఈవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.