Wednesday, 4 November 2026

విద్యార్థినులకు ఆరోగ్య కిట్లు

 ఇందుకోసం రూ.వందకోట్లు కేటాయించాం
84కేజీబీవీలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలాచర్యలు
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది
కాంగ్రెస్‌ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
టీచర్ల బదిలీల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కడియం
హైదరాబాద్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. టీచర్ల బదిలీలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను శ్రీహరి గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం 573 గురుకులాలు ఏర్పాటు చేశామని కడియం తెలిపారు. గురుకులాల విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నట్లు చెప్పారు. 84 కేజీబీవీలను అప్‌డేట్‌ చేసి 84 చోట్ల జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థినుల ఆరోగ్యానికి అవసరమైన కొత్త మెనూను ప్రారంభిస్తున్నాం. అన్ని కేజీబీవీల్లోనూ ఒకే రకమైన మెనూను అందిస్తాం. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడియం చెప్పారు. విద్యార్థినుల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య కిట్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఆరోగ్య కిట్లు అందించేందుకు అవసరమైన రూ.100కోట్ల నిధులు కేటాయించామన్నారు. 7నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు హెల్త్‌కిట్స్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉపాధ్యాయ నిమామకాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. నిర్ణయం తీసుకోగానే కాంగ్రెస్‌ వారే కోర్టులో కేసులు వేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారు. అసహనంతో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకున్నాం. ఆ వివరాలు కోర్టుకు అందజేశాం. ఫీజులు నియంత్రించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పేర్కొన్నారు.