Tuesday, 3 November 2026

విద్యార్థుల ఆరోగ్యంపై కదిలిన యంత్రాంగం

 

సత్ఫలితాలు ఇవ్వనున్న నీటిగంట

అందుకు తగ్గట్లుగా చర్య తీసుకోవాలి

హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): విద్యార్థులకు సకాలంలో నిత్యం నీళ్లు అందించకుంటే అనారోగ్యం పాలవుతారన్న వైద్యుల సూచలన మేరకు ప్రభుత్వాలు ఇటీవల చర్యలకు ఉపక్రమించారు. స్కూళ్లలో ఇందుకు ప్రత్యేకంగా నీటి గంట సమయాలు నిర్దారించారు. పిల్లలు కనీసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ పాఠశాలల్లో అధిక శాతం మంది విద్యార్థులు రోజుకు అర లీటరు నీటిని కూడా తాగడం లేదు. నీటిని తగిన రీతిలో తాగాలన్న అవగాహన లేకపోవడం, పాఠశాలల్లో ఎక్కువగా నీరు తాగితే తరచూ మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెంగ, ఎడతెరిపి లేకుండా తరగతుల నిర్వహణ వంటి కారణాలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు పెరగడం, పిత్తాశయంలో రాళ్లు అడ్డుపడడం వంటి వ్యాధులు వారిని వెంటాడు తున్నాయి. దీని మూలాల్లోకి వెళితే అధిక శాతం పాఠశాల విద్యార్థులు సరిపడా నీరు తాగడం లేదు. దీనివల్ల వారు పలు వ్యాధుల బారినపడుతున్నారు. పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉన్నా, ఇళ్ల నుంచి సీసాల్లో నీటిని తీసుకెళ్లినా, పరిస్థితిలో మాత్రం మార్పు ఉండటం లేదు. దీంతో పిల్లలు త్వరితగతిన నీరస పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికోసం కేరళ ప్రభుత్వ పాఠశాలలో రోజుకు నాలుగు సార్లు గంట మోగిస్తున్నారు. ఆ నీటి గంట సమయంలో తగిన మోతాదులో వారు నీటిని తాగేట్లు చూస్తున్నారు. తద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ సమస్యను అధిగమించేందుకు కేరళ రాష్ట్రం లోని చెరువత్తూరు, వలియపరంబు గ్రామ పంచాయతీల పరిధి లోని పాఠశాలల్లో ప్రత్యేకంగా ‘నీటి గంట’ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి మూడు గంటలకు ఒకసారి గంటను మోగిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న కర్నూలు జిల్లా అధికారులు ‘నీటి గంట’కు శ్రీకారం చుట్టారు. వినూత్నంగా మొదలైన ఈ కార్యక్రమం విూడియా, సోషల్‌ విూడియాలలో వైరల్‌ అయ్యింది. ఇదే స్ఫూర్తితో కర్ణాటక, తమిళనాడు, ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్రలో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు. నిర్దేశిరచిన సమయంలో పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కొళాయిలు, ఇతర సదుపాయల నుంచి నీటిని పట్టుకుని తాగాలి. ఇందుకు 2 నుంచి 5 నిముషాల సమయాన్ని కేటాయిస్తారు. ఇంటి వద్ద నుంచి కూడా తాగు నీటిని తెచ్చుకోవచ్చు. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ‘నీటి గంట’ను విధిగా అమలు చేయాలి. ఇది మంచి కార్యక్రమం కావడం వల్ల ప్రైవేటు పాఠశాలలు కూడా దీని అమలుకు చర్యలు తీసుకోవాలి. అయితే మన రాష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాలలో ఇప్పటికీ తాగునీటి సౌకర్యం లేని ప్రభుత్వ పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విద్యా శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో నిత్యం నాలుగు పర్యాయాలు నీటిని తాగించేలా నీటి గంట కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈమేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దీనిని తక్షణం అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాలలో కొన్ని స్కూళ్లలో ఇప్పటికే నీళ్ళ గంటలు కొట్టి విద్యార్థులచే తాగిస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. దీని విూద మరింత అధ్యయనం చేయమని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. కాబట్టి ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో నీటి వసతి కల్పించాలి. వాటి మరమ్మతులు, నిర్వహణ బాధ్యతలు పంచాయితీ రాజ్‌, గ్రావిూణ నీటి సరఫరా శాఖలకు కేటాయించాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది.