ప్రత్యామ్నాయ నాయకుడు లేని రాష్ట్రంగా తెలంగాణ
అందుకే కఠిన నిర్ణయాలతో ముందుకు
ఆర్టీసీ విషయంలోనూ ఇదే ధోరణి
హైదరాబాద్,నవంబర్26(జనం సాక్షి): తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సత్ఫలితాలనే ఇస్తున్నాయి. గత ఎన్నికలలో సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తే నష్టం జరుగుతుందని పార్టీలో కొందరు సీనియర్లు వాదించినా… సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడం, వారంతా ఎన్నికల్లో గెలవడంతో కేసీఆర్‌కు తిరుగులేకుండా పోయింది. ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పుడే జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో కూడా భారీ మెజారిటీ లభించడం తో పార్టీలో కేసీఆర్‌కు ఎదురు చెప్పేవారే లేకుండా పోయారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమనీ కలలుగన్న విపక్షాలకు హుజూర్‌నగర్ పెద్ద షాక్ ఇచ్చింది. కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్న వాళ్లు కూడా ప్రత్యామ్నాయ నాయకుడు ఎవరంటే నోరు వెళ్లబెట్టే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామం సిఎం కేసీఆర్‌కు బాగా కలిసి వస్తోంది. ప్రత్యామ్నాయం కోసం పోటీపడుతున్న కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి చెందినవారు నాయకత్వ పటిమను పెంచుకునే ప్రయత్నాలు చేయకుండా కేసీఆర్‌ను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు. రాజకీయంగా కేసీఆర్ ముందు నిలబడే నాయకుడే లేకుండా పోయారు. ఈ కారణంగా కేసీఆర్‌ను నిలువరించే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయింది. ఫలితంగా ఆర్టీసీ కార్మికులకు ప్రస్తుత దుస్థితి దాపురించింది. టెలికాం రంగంలో ప్రైవేట్ ఆపరేటర్లకు పెద్దపీట వేయడంతో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థలు ఇప్పుడు దివాలా బాట పట్టాయి. ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేసే సిబ్బంది కూడా కొంతవరకు ఈ పరిస్థితికి కారణం. హక్కుల కోసం మాత్రమే పోరాడిన వారు తమ బాధ్యతల గురించి విస్మరించారు. దీంతో
పాలకులు ఆయా రంగాలను ప్రైవేటుపరం చేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లను మూసివేశారు. అయితే వాటిల్లో పని చేసిన వారి సంఖ్య స్వల్పంగా ఉన్నందున అప్పట్లో సమస్య ఏర్పడలేదు. ఆర్టీసీ పరిస్థితి వేరు. 50 వేల మందికిపైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న అతి పెద్ద రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఇది. ఈ సంస్థకు కూడా ఇప్పుడు మనుగడ లేకుండా చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సాకుతో 50 శాతం బస్సు రూట్లను ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం, హైకోర్టు సమర్థించడం జరిగిపోవడంతో ఆర్టీసీని రక్షించాలన్న ఆలోచన నుంచి సిఎం కెసిఆర్ దూరం జరిగారు. దీంతో ఆయన చెప్పినట్లుగానే ఆర్టీసీ కథ కంచికి చేరిందనే భావించాలి. ఒకప్పుడు ప్రైవేట్ ఆపరేటర్ల చేతిలో ఉన్న రూట్లను జాతీయం చేయాలన్న డిమాండ్ ఉండేది. మారిన పరిస్థితులలో ఆర్టీసీకి నష్టాలు రావడం సహజం. లాంగ్ రూట్లు మాత్రమే లాభదాయకంగా ఉంటున్నాయి. పల్లె వెలుగు పేరిట నిర్వహిస్తున్న రూట్లలో నష్టమే వస్తుంది. ఒకప్పుడు గ్రామాలకు బస్సులు రావాలన్న డిమాండ్ ఉండేది. ఇప్పుడు మారుమూల గ్రామాలలో సైతం ద్విచక్ర వాహనాలు, ఆటోలు రావడంతో బస్సు ఎక్కేవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ఆర్టీసీ ఆదాయం తగ్గిపోయింది. ఇదొక సహజ పరిణామంగానే చూడాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మినీ బస్సులను ప్రవేశపెట్టకపోవడం వల్ల ఈ పరిణామం తలెత్తింది. నష్టాల బూచితో ఆర్టీసీని మనుగడలో లేకుండా చేయాలన్నేకైక సంకల్పంతో సిఎం కెసిఆర్ ఉన్నారు. అందుకే సమ్మె విరమణ ప్రతిపాదనను ఆయన పట్టించుకోవడం లేదు. సమ్మె చేయడం కెసిఆర్‌కు బాగా కలసి వచ్చింది. ప్రజలు కూడా ఉన్న బస్సులతో అడ్జస్ట్ కావడంగత రెండు నెలలుగా అలవాటు చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు, వారి నాయకులు ప్రస్తుత పరిస్థితులలో కేసీఆర్‌ను శరణు కోరడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రతిపక్షాలు గానీ, కార్మికులు గానీ ముఖ్యమంత్రిని ప్రభావితం చేయగల పరిస్థితుల్లో లేరు. ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ఫోన్ చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులోకి రాలేదని చెప్పడం చూస్తూ బిజెపి కూడా నాన్ సీరియస్‌గా ఉందనుకోవాలి. తాను పెంచి పోషించిన అశ్వత్థామరెడ్డి తననే ధిక్కరించడాన్ని కేసీఆర్ సహించలేకపోయి ఉండవచ్చు. ఈ కారణంగా.. కేసీఆర్ అంగీకరిస్తే అశ్వత్థామరెడ్డిని పక్కనపెట్టి మిగతా నాయకులను చర్చలకు పంపేందుకు కూడా తాము సిద్ధమని వర్తమానం పంపినా.. ముఖ్యమంత్రి మనసు కరగలేదు. నాయకులను కాదని తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి విధుల్లో చేరడానికి కార్మికులు సిద్ధపడకపోవడం కూడా కేసీఆర్ ఆగ్రహానికి కారణమై ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో కేసీఆర్ మరింత కఠినంగా ఉన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ వంటి సంస్థకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కార్మికలు, నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రజలు మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు కనుక మేం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భ్రమించడం పొరపాటు. ఇవ్వాళ జైకొట్టినవాళ్లే రేపు ఛీకొట్టవచ్చు. రాజకీయాల్లో ఎన్టీరామారావును కూడా పాతరేసారు. పాలకులు ప్రజల మనసెరిగి నడుచుకోవాలి. అప్పుడే మంచి నేతగా రాణిస్తారు.




