కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఓ రెండు కాలేజీలు, కొన్ని స్కూళ్లు పిల్లలను యంత్రాల్లాగా తయారు చేస్తున్న తీరును తట్టుకోలేని ఎందరో పిల్లలు భవిష్యత్ కానరాక, ఒత్తిడి తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే డజనుకు పైగా విద్యార్థులు నేలరాలి పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఈ సమస్యపై కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలు దీనిని ఓ సవాల్‌గా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. రేపటి పౌరులను కాపాడుకునేందుకు సమాజం కడా నడుం బిగించాలి. విద్యారంగ సంస్కరణలతో కార్పోరేట్ వసూళ్లకు కళ్లెం వేయడానికి విప్లవాత్మక చర్యలకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా తెలుగు రాష్టాల్ల్రో రైతులను మించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలను చదువుల కోసం పంపిస్తే శవాలుగా తిరిగి వస్తున్న తీరు దారుణమైన పరిస్థితులకు అద్దం పడుతోంది. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ వైపు పరుగులు తీయించిన తీరు దీనికి కారణంగా చూడాలి. ప్రభుత్వాల విధానాల పర్యవసానాలే విద్యా రంగాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాయి. అయినా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదు. తెలుగు రాష్టాల్ల్రో విద్యార్థుల ఆత్మహత్యలపై పెద్దగా స్పందన లేకుండా పోయింది. హెచ్చరికలు చేసినా కాలేజీ యాజమా న్యాలకు చర్మం మందం కావడంతో పట్టించుకోవడం లేదు. ఆత్మహత్యలను నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు కలెక్టరేట్లను ముట్టడించాయి. అనంతరం ర్యాలీలు, ధర్నాలు, దీక్షలు నిర్వహించాయి. కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరిపించాలి. ఆత్మహత్యలకు కారణమైన కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి. విచారణ జరిపితే తప్ప వరుసగా విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది. దేశానికి వెన్నముకగా నివాల్సిన రేపటి పౌరులు చదువుకునే ఒత్తిడిలో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న విషాదకర ఘటనలు రెండు తెలుగు రాష్టాల్ల్రోనూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇరు రాస్ట్రాఅల ప్రభుత్వాలు చర్యలకు దిగి, యాజమాన్యాలతో చర్చలు చేసిన తరవాత కూడా ఆత్మహత్యల పరంపర ఆగకపోవడం మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది. దీనినిబట్ట ప్రభుత్వం అంటే యాజమాన్యాలకు భయం లేకుండా పోయిందన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పలు కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి. విద్యార్థుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలుగు రాష్టాల్రు నెంబర్‌వన్‌గా నిలిచిపోతోందన్న ఆందోళన పెరిగింది. జాతీయ నేరగణాంక బ్యూరో నివేదిక ప్రకారం దేశం మొత్తం విూద 2015లో 360 మంది విద్యార్థుల బలవన్మరణం పాలైతే, ఈ రెండు తెలుగు రాష్టాల్ల్రో 73 మంది ఆత్మహత్య చేసుకున్నారు.. ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సగటున రోజుకు 28 మంది విద్యార్థులు బలవన్మరణాలు పాలయ్యారు. వీటిలో చాలావరకు నారాయణ, చైతన్య కళాశాలల్లో సంభవించినవేనని లెక్కలు చెబుతున్నాయి. ఎన్నికల్లో కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధులతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఆ తరువాత వాటి ప్రయోజనాలకు కాపాడడానికే ప్రయత్నిస్తుం టాయి. ఈ ధోరణి మారాలి. కార్పొరేట్ విద్యా సంస్థలలో జరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలపై సమగ్ర సవిూక్ష జరిపి అందుకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలి. విద్యార్థులపై ఒత్తిడిని నివారించే చర్యలు చిత్తశుద్ధితో అమలుపరచాలి. ప్రభుత్వ విద్యను పాతరేస్తున్న కారణంగానే ఇలా జరుగుతోందన్న నిజాన్ని కాదనలేం. ప్రభుత్వం విద్యకు నిధులు వెచ్చించి గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తే తప్ప ప్రైవేట్ విద్యాలయాల విజృంభణను అరికట్టలేమని గుర్తుంచుకోవాలి. కార్పొరేట్ యాజమాన్యాల లాభాల
ఫ్యాక్టరీల్లో పసి మొగ్గలు నలిగి నాశనమైపోతున్నాయి. ర్యాంకుల కోసం విద్యార్థులు రాలిపోతున్నా వ్యాపారం ఎంతగా పెరిగిందన్న ధోరణిలోనే ఆయా యాజామాన్యాలు ఉన్నాయి. ఈ లాభాపేక్ష నుంచే విద్యార్థులను మట్టి మనుషులుగా చూసే ధోరణి పెరిగింది. ప్రిన్సిపాల్, అధ్యాపకుల వేధింపులు, మార్కులు సరిగా రాకుంటే చులకన చేసి మాట్లాడడం, సెక్షన్లు మార్చడం వంటి చర్యలతో విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురై ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేయడానికి వీల్లేదు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు వదిలి వెళ్లిన సూసైడ్ నోట్లను యాజమాన్యాలు బయటకు రానీయడం లేదు. ఈ బలవన్మరణాలను ఆపడానికి ప్రయత్నించ డానికి బదులు, వాటికి కారణాలను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు యజమాన్యాలు ప్రయత్నిస్తున్న తీరు వారి దాష్టీకానికి నిదర్శనంగా చూడాలి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించనంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. నిజానికి ఇవి ఆత్మహత్యలు కావు, కార్పొరేట్ యాజమాన్యాలు చేసిన హత్యలని విద్యార్థుల తల్లిదండ్రులు ఘోషిస్తున్నా సమాజంలో కదలిక రావడం లేదు. రైతాంగ ఆత్మహత్యలకు తప్పుడు కారణాలు చూపినట్లుగానే విద్యార్థుల ఆతహ్మత్యల విషయంలోనూ ప్రభుత్వాలు అసత్య ప్రచారం సాగిస్తున్నాయి. విద్యార్థుల బలవన్మరణాలకు ప్రేమ వైఫల్యాలు, కుటుంబ సమస్యలే కారణమని చెప్పడం సమస్యను పక్కదారి పట్టించడమే తప్ప మరొకటి కాదు. విద్యారంగాన్ని అంధకారంలోకి నెడుతున్న ఈ బలవన్మరణాలకు కారకులెవరు? వీటిని నివారించేం దుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎంత చెబితే అంత అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలల్లో పద్దెనిమిది గంటలు ఏకధాటిగా విద్యార్థులను రుద్దడం గురించి పదేపదే వివరాలు వస్తున్నా పట్టించుకోని తీరు దారుణం. ఈ ఆత్మహత్యలపై విచారణకు ఆదేశిస్తూనే సంస్కరణలకు శ్రీకారం చుట్టకపోతే ఆత్మహత్యల పరంపర యధావిధిగా సాగుతుందని ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి.




