ఉద్యోగులకు అకున్ ఆదేశాలు
హైదరాబాద్,మే4(జనం సాక్షి ): ఆహార భద్రత కార్డుదారులతో పాటు, ఇతర వినియోగదారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతిరోజు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి పంపించాలని నూతనంగా కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అకున్ సభర్వాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ సెల్ ఉన్నప్పటికీ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. టోల్‌ఫ్రీ నెంబరుకు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటిక ప్పుడు పరిష్కరిస్తూనే వినియోగదారులందరికీ పారదర్శకత సేవలు అందించాలని, వినియోగ దారులు మోసాలకు గురికాకుండా ఎప్పటికప్పుడు చైతన్యం, అవగాహన కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా విని యోగదారుల ఫోరం, పౌరసరఫరాలశాఖ టోల్‌ఫ్రీ నెంబరు పనితీరుపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రతిరోజు సీఆర్వో పరిధిలో వస్తున్న ఫిర్యాదులు, పరిష్కారాల డేటాను పంపించాలన్నారు. ఈ పాస్ యంత్రాలు, గోడౌన్ నుంచి రేషన్ సరుకులు లబ్ధిదారునికి చేరే వరకు ప్రతి క్షణం వాహనాల రాకపోకలకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు,కమాండ్ కంట్రోల్ విధానం, పోర్టబిలిటీ విధానం, కొత్త కార్డుల దరఖాస్తులకు సంబంధించి వివరాలు అందించాలని సూచించారు. సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూడాలని సూచించినట్లు ఉద్యోగులు చెప్పారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలుపడానికి వెళ్లిన సీఆర్వో కార్యాలయం అధికారులకు కమిషనర్ సూచించారు.
వినియోగదారుల ఫిర్యాదులపై ప్రత్యేకదృష్టి




