Tuesday, 3 November 2026

విశాఖలో ఆరుగురికి స్వైన్‌ఫ్లొ నిర్దారణ: కలెక్టర్‌

విశాఖపపట్టణం, ఫిబ్రవరి5: విశాఖలో ఇప్పటివరకు 24 స్వైన్‌ఫ్లొ అనుమానిత కేసులు నమోదు కాగా ఆరుగురికి స్వైన్‌ఫ్లొ నిర్దారణ అయినట్లు కలెక్టర్‌ యువరాజ్‌ తెలిపారు. మాస్క్‌ల కొరత లేదని, అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్వైన్‌ఫ్లొ మందులు అందుబాటులో ఉంచామని కలెక్టర్‌ యువరాజ్‌ తెలిపారు. కెజీహెచ్‌లో మంగళవారం రాత్రి ఇద్దరు స్వైన్‌ఫ్లొ లక్షణాలతో చేరారు. వారిని అనుమానిత కేసులుగా పరిగణించి వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ బి.ఉదయ్‌కుమార్‌ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కె.మల్లేశం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు, నగరంలో అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన గర్భిణీలో స్వైన్‌ఫ్లొ లక్షణాలు కనిపించాయి. ఇద్దర్నీ ఐఆర్‌సీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నామని డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌ వివరించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఇద్దరి నుంచి శ్వాబ్స్‌ సేకరించి స్వైన్‌ఫ్లొ నిర్ధరణ పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపినట్లు వెల్లడించారు. బాధితులకు స్వైన్‌ ఫ్లొ నివారణ మందులు ఇస్తున్నట్లు వివరించారు. ఆసుపత్రిలో మళ్లీ స్వైన్‌ఫ్లొ అనుమానిత కేసులు చేరడంతో మిగతా రోగులు, సహాయకులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించి ఆసుపత్రిలో తిరుగాడుతున్నారు. కేజీహెచ్‌ సిబ్బంది, వైద్యులు, నర్సులు సైతం మాస్కులు ధరిస్తున్నారు. ఇక స్వైన్‌ఫ్లొ వ్యాధి నివారణ మందులను కనకమహాలక్ష్మి కో ఆపరేటివ్‌ బ్యాంకు(ఎంవీపీ శాఖ) సిబ్బంది ఉచితంగా పంపిణీ చేశారు. బ్యాంకు ఖాతాదారులతో పాటు కాలనీవాసులందరికీ మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదిలావుంటే జిల్లాలో ఏటా 6 వేలకు పైగా క్షయ కేసులు నమోదవుతున్నట్లు జిల్లా క్షయ నివారణాధికారి ఎన్‌.వసుంధర తెలిపారు. గురువారం ఆమె నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కేసులను గుర్తించి అవసరమైన మందులను రోగులకు ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న నివారణ కేంద్రాలను 13 నుంచి 18కి పెంచుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 23 వరకూ క్షయ వ్యాధి నివారణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *