
బెల్లంపల్లి, జులై 7, (జనంసాక్షి )
విశ్వ కళ్యాణం లోక సంక్షేమం కోసం బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ రాజ శ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగానికి వేద పండితులు శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితుడు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, బ్రాహ్మణ శ్రీ దుద్దిళ్ల మనోహర శర్మ అవధాని ఆధ్వర్యంలో 35మంది రుత్విక్కుల సహకారంతో యాగం ప్రారంభం అయింది. ఉదయం 7 గంటలకు కృష్ణా మందిర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా యాగశాల వరకు అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు. ఉదయం 8-30 నుంచి యాగ సంకల్పం, జగద్గురువుల వందనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహావచనం, ఋతిగ్వరణము, రక్షా బంధనం, పంచగవ్య ప్రాశన ప్రవేశం, మంటప దేవతా, నవగ్రహ వాస్తు యోగిని, క్షేత్ర పాలక, సర్వతో భద్ర మంటప, స్థాపన పూజలు, అగ్ని మంధనం, మహా వ్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేకం, సప్తశతీ చండీ పారాయణములు, లలిత, విష్ణు సహస్ర పారాయణములు, శ్రీ రాజ శ్యామల మంద్ర అనుష్టానం, మూల మంత్ర హావనము నిర్వహించారు. రోజుకు 80 మంది జంటలతో యాగం నిర్వహిస్తున్నారు. ఈయాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు వివరించారు. యాగంలో మొదటి రోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య – జయతారా దంపతులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ గడ్డం కళ్యాణి – భీమా గౌడ్ దంపతులతో పాటు 80 మంది దంపతులు యాగంలో పాల్గొన్నారు. శోభయాత్రలో ఆర్యవైశ్య మహిళా మండలి కోలాట నృత్యాలతో అలరించారు. సాయంత్రం 6 గంటలకు ప్రదోశకాల పూజ, చతుర్వేద సహిత మహానీరాజన మంత్ర పుష్ప మహా సేవా, హారతి, ప్రవచనాలు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈకార్యక్రమంలో శ్రీ రాజ శ్యామల యాగ కమిటీ అధ్యక్షుడు చిలువేరు దయాకర్, ప్రధాన కార్యదర్శి ఎలుగూరి అంజయ్య, కోశాధికారి తణుకు నందయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు సిద్ధంశెట్టి శ్రీనివాస్, ముఖ్య సలహాదారుడు రేణికుంట్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా మండలి సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
విశ్వ కళ్యాణం లోక సంక్షేమం – శ్రీ రాజ శ్యామల యాగం. – ఆధ్యాత్మిక చింతనలో బెల్లంపల్లి పట్టణం.




